రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను.. ఎన్నో ఏళ్లుగా రైతు సంఘాలు, విపక్షాలు కూడా కోరుకుంటున్నాయని తెలిపారు.
గుజరాత్ పర్యటనలో భాగంగా.. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు మోదీ. ఈ నేపథ్యంలో రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు.
"మా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రైతులు, రైతు సంఘాలు ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్నాయి. ఇప్పుడు రైతులను తప్పుదోవ పట్టిస్తున్న నేతలే.. తమ హయాంలో ఇలాంటి చట్టాలు రావాలని అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు దేశం ఓ చారిత్రక నిర్ణయం తీసుకుంటే మాత్రం.. వీరు వ్యతిరేకిస్తున్నారు. అన్నదాతలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అయినా మేము రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం. వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.