తెలంగాణ

telangana

'మా పాలనలోనే మహిళల అభ్యున్నతి'

By

Published : Oct 18, 2020, 5:11 AM IST

బిహార్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్​ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. విపక్షాలను విమర్శిస్తూనే.. ఎన్​డీఏకు ముందు, తర్వాత పరిస్థితులు, అభివృద్ధి పనులను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన ప్రభుత్వం తమదేనని ఉద్ఘాటించారు నితీశ్.

bihar cm
బిహార్

బిహార్‌లో ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ సీఎం నితీశ్‌కుమార్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నబీనగర, ఔరంగాబాద్‌ తదితర జిల్లాల్లో ప్రచార సభల్లో శనివారం పాల్గొన్న ఆయన... బిహార్‌లో ఎన్డీయే పాలనకు ముందు, తర్వాత పరిస్థితులను ప్రజలకు వివరించారు. ఆర్జేడీ ప్రస్తుత సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్​ను ఉద్దేశిస్తూ పరోక్షంగా విమర్శల జల్లు కురిపించారు.

"రాజకీయాల్లో ఓనమాలు రాని వాళ్లు కూడా ప్రజల్లో పేరు పొందటం కోసం ఈ రోజు మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల ప్రచారం వాళ్లని చేసుకోనివ్వండి. ఎందుకంటే మేం చేసిన అభివృద్ధిని నమ్ముకున్నాం. వారిలా ప్రసంగాలకే పరిమితం కాలేదు. గతంలో వారు 15 ఏళ్లు అధికారంలో ఉండి కూడా మహిళల అభివృద్ధిపై కనీసం శ్రద్ధ పెట్టలేదు."

-నితీశ్ కుమార్, బిహార్ సీఎం

మహిళల అభివృద్ధిపై..

ఎన్డీయే పాలనలో మహిళల విద్యకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు నితీశ్. బాలికలకు సైకిల్‌ యోజన, పంచాయతీలో 50శాతం రిజర్వేషన్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. పోలీసు ఉద్యోగాల్లో 35శాతం మహిళలకే కేటాయించామని, ఈ స్థాయిలో ఏ రాష్ట్రం మహిళలకు ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు.

జీవిక పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. మళ్లీ అధికారంలోకి వస్తే పాఠశాల విద్య పూర్తి చేసిన బాలికలకు ఏటా రూ.10వేలు, కళాశాల విద్య పూర్తి చేసిన వారికి రూ.25వేల నుంచి రూ.50వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

నేరాల్లోనూ..

బిహార్‌లో తమ ప్రభుత్వ హయాంలో నేరాలు గణనీయంగా తగ్గినట్లు తెలిపారు. జాతీయ నేర గణాంకాల జాబితాలో బిహార్‌ 23వ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వమూ బిహార్‌ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందన్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని పేద వారిని ఆదుకునేందుకు ప్రధాని మోదీ ఆహార ధాన్యాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. రైతులకు సాయంగా రూ.6వేలు అందిస్తున్నట్లు నితీశ్‌ గుర్తుచేశారు.

ఇదీ చూడండి:బిహార్​ ఎన్నికల సమరంలో 'మోదీ డూప్​'

ABOUT THE AUTHOR

...view details