అయోధ్య భూ వివాదంపై చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. 27 ఏళ్ల క్రితం పీవీ నరసింహారావు ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని ఆధారంగా చేసుకుంది. బాబ్రీ మసీదు ఘటన అనంతరం శాంతి స్థాపన కోసం నాడు కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన చట్టమే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.
నాటి చట్టంపై వ్యతిరేకత..
1992 డిసెంబరులో బాబ్రీ మసీదు ఘటన అనంతర పరిణామాలతో పరిస్థితులు అదుపుతప్పాయి. వాటిని చక్కదిద్దేందుకు అప్పటి పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ 1993లో అయోధ్య భూసేకరణ చట్టాన్నితెచ్చింది. 1993 జనవరి 7న ఆర్డినెన్స్ తెచ్చిన పీవీ సర్కార్ తర్వాత.. దీనిని చట్టంగా మార్చింది. ఈ చట్టం ప్రకారం వివాదాస్పద స్థలం 2.77 ఎకరాల చుట్టూ 60.70 ఎకరాలను నరసింహారావు ప్రభుత్వం సేకరించింది.
ఆ స్థలంలో రామమందిరం, మసీదు, భక్తులకు తగిన సౌకర్యాలు, గ్రంథాలయం, మ్యూజియం, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు నిర్ణయించారు. అయితే భాజపా సహా ముస్లిం సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. దాంతో ఈ కార్యానికి ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో వివాదాస్పద స్థలంలో అంతకుముందు హిందూ ఆలయం లేదా మరేదైనా హిందూ నిర్మాణం ఉందా అనే అభిప్రాయం చెప్పాలని రాజ్యాంగంలోని 143వ ఆర్టికల్‌ను ఉపయోగించి రాష్ట్రపతి ద్వారా సుప్రీం కోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన జస్టిస్ వెంకటాచలయ్య నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సమాధానం చెప్పరాదని నిర్ణయించింది.