లాహోర్ కార్యక్రమంలో ఎంపీ శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై భాజపా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. మోదీ ప్రభుత్వం కరోనా నియంత్రణలో విఫలమైందని లాహోర్ థింక్ ఫెస్ట్ ఆన్లైన్ సమావేశంలో థరూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కరోనా సమయంలో ముస్లింలపై వివక్ష గురించి ఆయన చేసిన ప్రసంగంపై భాజపా శ్రేణులు మండిపడుతున్నాయి.
పాకిస్థాన్ వేదికపై భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంపై భాజపా ప్రతినిధి సంబిత్ పాత్రా విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నట్లు వ్యాఖ్యానించారు. దేశాన్ని ఆయన కించపరిచారని అన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ లక్ష్యంగా సంబిత్ పాత్రా తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. చైనా, పాకిస్థాన్లలో ఇప్పటికే రాహుల్ హీరో అని అన్నారు. రాహుల్‌ను ఇక నుంచి రాహుల్ లాహోరీగా పిలుస్తామని వ్యాఖ్యానించారు.
"ఇలాంటి విషయాలు పాకిస్థాన్ ఫోరంపై చర్చించాల్సిన అవసరం ఏం ఉంది? భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో ఇంకోటి లేదు. పాకిస్థాన్‌లో మైనారిటీల పట్ల వివక్ష, హింసపై ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఎప్పుడైనా ఆ దేశాన్ని ప్రశ్నించారా?"
-సంబిత్ పాత్రా, భాజపా ప్రతినిధి