శ్రీలంకలో పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన సందర్భంగా ఆ దేశ ప్రధానమంత్రి మహీంద రాజపక్సతో ఫోన్లో మాట్లాడారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎన్నికల్లో రాజపక్స విజయం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వేళ పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు చెప్పారు.
కరోనా మహమ్మారి అవరోధాలు ఉన్నప్పటికీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు శ్రీలంక ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని మోదీ ప్రశంసించారు.
"ముందస్తు ఎన్నికల ఫలితాలు శ్రీలంక పోడుజన పెరమున పార్టీ (ఎల్ఎల్పీపీ) అద్భుతమైన పనితీరును సూచిస్తున్నాయి. ఈ విషయంలో మహీంద రాజపక్సకు నా శుభాకాంక్షలు. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, ఇరు దేశాల బంధం సరికొత్త శిఖరాలకు తాకేందుకు కృషి చేస్తాం."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఇరువురి మధ్య ఫోన్ సంభాషణలో.. గతంలో జరిగిన ఫలవంతమైన, స్నేహపూర్వక చర్చలను నేతలు గుర్తు చేసుకున్నట్లు తెలిపింది భారత విదేశాంగ శాఖ. ఈ సందర్భంగా భారత్లోని బౌద్ధ క్షేత్రం కుశినగర్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్లు రాజపక్సకు మోదీ వివరించారని, శ్రీలంక పర్యటకులను స్వాగతించేందుకు నగరం ఎదురుచూస్తున్నట్లు చెప్పారని తెలిపింది. కరోనా మహమ్మారితో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ఇరుదేశాలు కలిసి పనిచేయాలని అంగీకరించారని పేర్కొంది.
మోదీకి కృతజ్ఞతలు..
తనకు శుభాకాంక్షలు తెలిపినందుకుగాను ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స. దేశ ప్రజల మద్దతుతో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. శ్రీలంక, భారత్లు మంచి స్నేహితులుగా పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కరోనా కాలంలోనూ ఆ దేశంలో పార్లమెంట్ ఎన్నికలు