ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు పలికే పాకిస్థాన్ విధానాల వల్ల ఆ దేశంతో సాధారణ సంబంధాలు కొనసాగించడం కష్టతరంగా మారిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. శాశ్వత సమస్యలను పక్కనబెడితే.. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉగ్రవాద సమస్య గురించే ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు.
ఆసియా సొసైటీ నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో మాట్లాడిన జైశంకర్... భారత్-పాకిస్థాన్ సంబంధాలపై చర్చించారు. ఉగ్రవాదం కాకుండా ఇరుదేశాల మధ్య ఎన్నో సమస్యలు ఉన్నాయని వివరించారు. భారత్తో సాధారణ వాణిజ్యం కూడా పాకిస్థాన్ చేయడం లేదని అన్నారు. భారత్కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్(ఎంఎఫ్ఎన్) హోదా కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇరుదేశాల మధ్య వీసా సంబంధాలు అత్యంత పరిమితంగా ఉన్నాయని తెలిపారు. అఫ్గానిస్థాన్-భారత్ మధ్య రాకపోకలను పాక్ నిషేధించిందని పేర్కొన్నారు.
"సాధారణంగా పొరుగుదేశాలు వర్తకం చేసుకుంటాయి. వీసాలు జారీ చేసుకుంటాయి. కనెక్టివిటీని అందిస్తాయి. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పాటించవు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు.. 'ప్రత్యేకమైన ఈ పొరుగువారితో మీకు సాధారణ సంబంధాలు ఎలా ఉన్నాయ'నే ప్రశ్న.. మా విదేశాంగ విధానానికి చాలా ఇబ్బందిగానే ఉంటుంది."
-సుబ్రహ్మణ్యం జైశంకర్, భారత విదేశాంగ మంత్రి