హైదరబాద్ వంటి మహా నగరాల్లో రూఫ్ గార్డెనింగ్, టెర్రస్ ఫామింగ్ వంటివి ఈ మధ్య ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్లో భగీరథీ ప్రసాద్ బిసాయీ అనే రైతు 1996 నుంచే మేడపై వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు.
వాటర్ ప్రూఫ్ మేడను కట్టి.. 3 వేల చదరపు అడుగుల స్థలంలో 6 అంగుళాల ఎత్తులో మట్టిని పరిచి మేడనే నేలగా చేశారతను. 3 అంగుళాల మేర నీటిని నిల్వ ఉంచి ఏడాదికి దాదాపు క్వింటా వరిని పండిస్తున్నారు. కొంత స్థలంలో పచ్చిమిర్చి, టమాట, గోబీ, బెండకాయ, వంకాయ వంటి కూరగాయలను పండిస్తూ వ్యవసాయం పట్ల తనకున్న మక్కువను చాటుతున్నారు.
"భూమి మొత్తం భవనాలే నిండిపోతున్నాయి. ఇక వ్యవసాయానికి చోటు ఎక్కడుంది. అందుకే దృఢమైన మేడపై మట్టిని వేసి నేలగా మార్చాను. ఇంత స్థలం మనకు కింద దొరకదు. ఈ మేడను రసాయనాలు వేసి దృఢంగా నిర్మించాం. ఇక్కడ మట్టి, నీరు వేశాక నేల అవసరమేముంది."
-భగీరథీ ప్రసాద్ బిసాయీ, రైతు
బంగ్లా పైన పంట పండించడం వలన స్థలంతో పాటు ఖర్చూ, సమయమూ కలిసి వస్తాయంటారు బిసాయీ. ఆయనకు వ్యవసాయం రోజువారీ పనుల్లో భాగం. భిన్న పద్ధతులను అనుసరిస్తూ నిత్యం వ్యవసాయంలో ప్రయోగాలు చేస్తుంటారు.
"పెద్దగా ఖర్చేమీ ఉండదు.. కష్టించి పని చేస్తే సరిపోతుంది. పొలం కూడా దగ్గరే ఉంటుంది. ఎక్కువ మంది అవసరం లేదు. హైబ్రీడ్ పంటలను పండించను. నేను పంటకు ఎరువులు వాడను. పేడ కూడా చల్లను. మేడపై పేడ ఎరువులు వాడితే పంట దిగుబడి తగ్గుతుంది."