2017-18 సంవత్సరానికి రూ. 47.19 కోట్లతో అత్యధిక ఆదాయం పొందిన ప్రాంతీయ పార్టీగా సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) నిలిచింది. రూ. 35.748 కోట్లతో డీఎంకే, రూ. 27.17 కోట్లతో తెలంగాణ రాష్ట్ర సమితి, రూ. 19.4 కోట్లతో తెలుగుదేశం, రూ. 14.239 కోట్ల ఆదాయంతో వైకాపా తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
ఎన్నికల సంఘానికి పార్టీలు సమర్పించిన ఆడిట్ రిపోర్టు ఆధారంగా ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్) ఈ విషయాలు వెల్లడించింది.
37 పార్టీలు..
దేశంలో 48 గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలున్నాయి. వీటిలో 37 ప్రాంతీయ పార్టీలు ఆడిట్ రిపోర్టు సమర్పించాయి. ఆదాయ, వ్యయ నివేదిక సమర్పించని వాటిలో బీపీఎఫ్, జేకేఎన్సీ, జేకేపీడీపీ లాంటి పార్టీలు ఉన్నాయి.
అన్ని ప్రాంతీయ పార్టీల ఆదాయం కలిపి రూ. 237 కోట్లు. ఇందులో ఎస్పీ, డీఎంకే, టీఆర్ఎస్ పార్టీల ఆదాయం 46.65 శాతం(రూ. 110.21 కోట్లు). ఎస్పీ వాటా 19.89 శాతం. డీఎంకేకు 15.07 శాతం, తెరాసకు 11.49 శాతం వాటా ఉంది.
తగ్గిన ఆదాయం...
2016-17తో పోల్చితే 2017-18లో 15 ప్రాంతీయ పార్టీల ఆదాయం తగ్గింది. 34 పార్టీల ఆదాయం రూ. 409.64 కోట్ల నుంచి 42 శాతం ప్రతికూల వృద్ధితో రూ. 236.86 కోట్లకు చేరింది.