దేశ రాజధాని దిల్లీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. హౌజ్ కాజీ ప్రాంతంలోని ఓ పార్కింగ్ స్థలంపై మొదలైన గొడవలో.. స్థానిక ఆలయం ధ్వంసమయింది. ఫలితంగా పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు ఆలయ ధ్వంసానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
ఈ ఘటనపై స్పందించిన మధ్య దిల్లీ డిప్యూటీ కమిషనర్ మణ్దీప్ సింగ్.. ప్రజలను సంయమనం పాటించాలని కోరారు.
"హౌజ్ కాజీలో పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ తీవ్రమయింది. రెండు మతాలకు చెందిన వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మేం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అందరి మనోభావాలను గౌరవమిస్తూ చర్యలు చేపడతాం. పరిస్థితులు చక్కబడే వరకూ ప్రజలు సహకరించాలి."