బలపరీక్షకు స్పీకర్ డెడ్‌లైన్- నేడు ఓటింగ్! కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన పెను సంక్షోభాన్ని సోమవారం ముగిస్తామని స్పీకర్ రమేశ్ కుమార్ హామీ ఇచ్చినా.. అధికార ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం లేక అసెంబ్లీ నేటికి వాయిదా పడింది. ఈ విషయంలో విశ్వాసంపై ఓటింగ్‌కు డెడ్‌లైన్ విధించారు స్పీకర్.
పరీక్ష జరగాల్సిందే..
మంగళవారం సాయంత్రం 4గంటలకు బలాన్ని నిరూపించుకోవాలని స్పీకర్ రమేశ్ కుమార్ అధికార పక్షానికి డెడ్‌లైన్ విధించారు. ఈ నేపథ్యంలో బల నిరూపణకు రాత్రి 8 గంటల వరకు సీఎల్పీ నేత సిద్ధరామయ్య సమయం కోరారు. అందుకు సాధ్యం కాదని స్పీకర్ తేల్చిచెప్పారు. ఫలితంగా నేడు విశ్వాస ప్రక్రియ పూర్తి చేస్తామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
చర్చ తర్వాత బలపరీక్ష
అయితే కాంగ్రెస్ తరఫున కొంత మంది మాట్లాడాల్సి ఉందని స్పీకర్‌ను సిద్ధరామయ్య కోరారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్.. ఈ రోజు సాయంత్రం 4 గంటల్లోపు చర్చను ముగించాలని సూచించారు. అనంతరం సాయంత్రం 6గంటలకు విశ్వాస పరీక్షను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
రోజంతా గందరగోళమే..
రెండు రోజుల విరామం తర్వాత సోమవారం ప్రారంభమైన విధాన సభలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. విశ్వాస పరీక్షను ఈ రోజే చేపట్టాలని ప్రతిపక్షం.. వాయిదా వేయాలని అధికార పక్షం పట్టుబట్టడం వల్ల సభలో గందరగోళం నెలకొంది.
ఎంత రాత్రయినా సరే సభలోనే ఉంటామని, బల నిరూపణ పూర్తి చేయాల్సిందేనని ప్రతిపక్ష నేత యడ్యూరప్ప పట్టుబట్టారు. ముందుగా ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారాన్ని తేల్చాలని సీఎం కుమారస్వామి తెలిపారు. విప్ జారీపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకు బలపరీక్ష నిర్వహించవద్దని ఆయన స్పీకర్‌ను కోరారు. అధికార పార్టీ సభ్యులు సభను మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు.
వేర్వేరు పిటిషన్లపై నేడు సుప్రీం విచారణ
కర్ణాటకలో తక్షణమే బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. గవర్నర్ ఆదేశించినా బలపరీక్షకు ఓటింగ్ జరగని పక్షంలో ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మరోవైపు బలపరీక్ష సందర్భంగా సభ్యులకు విప్ జారీపై కోర్టు నుంచి స్పష్టత కోరుతూ పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు వ్యాజ్యం దాఖలు చేశారు. విశ్వాస పరీక్షకు గడువు విధిస్తూ గవర్నర్ వాజుభాయి వాలా తనకు లేఖలు రాయడంపై సీఎం కుమారస్వామి ఇప్పటికే మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నింటిపై సుప్రీం నేడు విచారించనుంది.
ఇదీ చూడండి: కర్ణాటకపై రాజ్యసభలో రగడ... 3సార్లు వాయిదా