క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్‌కు భద్రత కుదిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 90 మంది ప్రముఖుల భద్రతపై సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రభుత్వం ఈ మేరకు సవరణలు చేసింది. ఆయా వ్యక్తులకు పొంచి ఉన్న ముప్పును ప్రభుత్వం నియమించిన కమిటీ అంచనా వేసి తాజా మార్పులు చేసింది. ఇప్పటివరకు ఎక్స్ కేటగిరీ భద్రత అనుభవిస్తున్న సచిన్‌ను.. ఆ కేటగిరీ నుంచి తొలగించింది. అయితే సచిన్‌కు పోలీస్ ఎస్కార్ట్ సౌలభ్యం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.
మరోవైపు యువసేన(శివసేన యూత్ విభాగం) అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకు భద్రతను పెంచింది ప్రభుత్వం. ఇదివరకు ఉన్న వై ప్లస్ కేటగిరీని మార్చి జెడ్ కేటగిరీలో చేర్చింది.
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు జెడ్ ప్లస్ భద్రతను ప్రభుత్వం కొనసాగించనుంది. అజిత్ పవార్‌కు సైతం ఇంతకు ముందు ఉన్న జెడ్ కేటగిరీ భద్రతను మార్చలేదు. సామాజిక కార్యకర్త అన్నా హజారే భద్రత స్థాయిని వై ప్లస్ నుంచి జెడ్ కేటగిరీకి మార్చినట్లు అధికారులు తెలిపారు.