గల్వాన్ లోయ ఘటనపై భారత్, చైనా మధ్య మూడు దఫాల చర్చల అనంతరం డ్రాగన్ ఆధీనంలో ఉన్న పది మంది భారత సైనికులు విడుదలయ్యారు. ఇద్దరు ఉన్నతాధికారులతో సహా మొత్తం పది మంది భద్రతా సిబ్బంది గురువారం సాయంత్రం భారత్‌కు చేరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
1962 తరువాత భారతీయ సైనికులు చైనాకు చిక్కటం ఇదే తొలిసారని పరిశీలకులు అంటున్నారు.
మంగళవారం నుంచి గురువారం వరకు గల్వాన్ లోయలోని పెట్రోల్ పాయింట్ 14 వద్ద మేజర్ జనరల్ స్థాయి అధికారులు మూడు సార్లు భేటీ అయ్యారు. జనరల్ అభిజిత్ బాపట్ అదే స్థాయి చైనా సైన్యాధికారితో గురువారం చర్చలు జరిపారు. ఈ అంశంపై ఇరుదేశాల్లోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్నందున చర్చకు వచ్చిన అంశాలు, ఫలితాలను గోప్యంగా ఉంచుతున్నారు.
ఇంకెవరూ లేరు..
ప్రస్తుతం చైనా అధీనంలో భారత సైనికులెవరూ లేరని శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు ఆ దేశ విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి జావో లిజియాన్. భారత్ అధీనంలో చైనా సైనికులున్నారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ఆ విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఇరు దేశాలు దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు జరుపుతున్నాయని చెప్పారు.
జూన్ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరుదేశాల సైనికల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటి వరకు 20 మంది భారతీయ సైనిక సిబ్బంది మృతిచెందగా... 76 మంది గాయపడినట్టు సమాచారం. ఇక వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితిని చక్కదిద్దేందుకు చైనా, భారత్‌కు చెందిన సీనియర్ సైనికాధికారులు మే నుంచి ఇప్పటి వరకు పలుమార్లు భేటీ అయ్యారు.
ఇదీ చూడండి: ట్రంప్‌పై అమెరికన్ల అసంతృప్తి.. బిడెన్ ఆధిక్యం