తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య తీర్పు: కట్టుదిట్టమైన భద్రత నీడలో దేశం - భద్రత నీడలో దేశం

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు మరికాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కేసుకు సంబంధించి కీలక ప్రాంతమైన అయోధ్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. మూడంచెల భద్రత వ్యవస్థతో అయోధ్య నిఘా నేత్రంలో ఉంది.

అయోధ్య తీర్పు

By

Published : Nov 9, 2019, 10:13 AM IST

వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయింది. అయోధ్య, చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను పటిష్ఠం చేసింది.

వివాదానికి కేంద్రమైన అయోధ్యపై ప్రత్యేక దృష్టి సారించారు అధికారులు. ప్రాంతాన్ని బట్టి వివిధ అంచెల భద్రతలను ఏర్పాటు చేశారు. పర్యటకులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు.

31 జిల్లాల్లో...

ఉత్తర్​ప్రదేశ్​లోని సున్నితమైన ప్రాంతాలుగా 31 జిల్లాలను గుర్తించిన ప్రభుత్వం.. ఆయా ప్రదేశాల్లో 144 సెక్షన్​ను విధించింది. రాష్ట్రవ్యాప్తంగా 5 లేదా అంతకన్నా ఎక్కువమంది కలిసి తిరగటంపై ఇప్పటికే నిషేధం ఉంది. ప్రతి జిల్లాల్లో తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేసింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం.

రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర హోంశాఖ సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 4వేల కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించింది హోంశాఖ.

సామాజిక మాధ్యమాలపై నిఘా

సామాజిక మాధ్యమాలకు సంబంధించి 670 మందిపై నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి దుష్ప్రచారం వ్యాప్తి కాకుండా అంతర్జాల సేవలను నిలిపేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా..

134 ఏళ్ల వివాదంపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఉత్తర్​ప్రదేశ్​ సహా దిల్లీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్​, కర్ణాటక, జమ్ముకశ్మీర్​ ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో అంతర్జాల సేవలను నిలిపేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

రాష్ట్రాల్లో..

రాజస్థాన్​లోని భరత్‌పుర్‌ సహా మరికొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో రేపు ఉదయం 6 గంటల వరకు అంతర్జాల సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జైసల్మేర్‌లో ఈ నెల 30 వరకు 144 సెక్షన్‌ విధించారు. తీర్పు నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వమూ అప్రమత్తమైంది. ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులను అందుబాటులో ఉండాలని ఆదేశించింది. స్థానిక పోలీసులతో కలిసి సమన్వయం చేసుకోవాలని తెలిపింది.

జమ్ముకశ్మీర్‌లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్తార్‌పుర్ నడవా ప్రారంభం, అయోధ్య తీర్పు నేపథ్యంలో పంజాబ్‌లో భద్రతా ఏర్పాట్లపై ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సుప్రీం కోర్టు.. న్యాయమూర్తులకూ..

కీలక తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టుకు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అందులో భాగంగా దిల్లీ పోలీసులు, రాజస్థాన్ ఆర్మ్స్, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది పహారా కాస్తున్నారు. అయోధ్య సహా యూపీ అంతా డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

ఈ కేసు విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులకూ భద్రతను పెంచారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగొయికి జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పించారు. వారి నివాసాల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యాయమూర్తులంతా పూర్తి భద్రత మధ్య నేడు కోర్టుకు వెళ్లనున్నారు.

ఇదీ చూడండి: నేడే అయోధ్య భూవివాదం కేసుపై తీర్పు

ABOUT THE AUTHOR

...view details