దేశంలో సగటు ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన ఓ సర్వేలో వెల్లడైంది. ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ క్లైమెట్ ఛేంజ్ రీసెర్చ్ చేసిన ఈ అధ్యయనం ప్రకారం.. 21వ శతాబ్దం చివరి నాటికి దేశంలో దాదాపుగా 4.4 డిగ్రీ సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు అధికమవుతాయి. వేడిగాలుల ప్రభావం కూడా 3-4 రెట్లు పెరిగే అవకాశం ఉంది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ అధ్యయనాన్ని మంగళవారం పబ్లిష్ చేయనున్నారు.
"1901-2018 మధ్య కాలంలో భారత్ సగటు ఉష్ణోగ్రతలు 0.7 డిగ్రీ సెల్సియస్ పెరిగాయి. కర్బన ఉద్గారాలే ఇందుకు ప్రధాన కారణం. 1986-2015 మధ్య 30 ఏళ్లలో పగటి పూట వేడి ఉష్ణోగ్రత 0.63 డిగ్రీలు, రాత్రి పూట చలి ఉష్ణోగ్రతలు 0.4 డిగ్రీ సెల్సియస్ మేర పెరిగాయి. ఈ దశాబ్దం చివరి నాటికి పగటి పూట అత్యంత వేడి ఉష్ణోగ్రత 4.7, రాత్రి పూట అత్యంత శీతల ఉష్ణోగ్రత 5.5 డిగ్రీల సెల్సియస్ పెరగనున్నాయి.