తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​ బరిలో 'తెలుగు' ఆట- దీదీ అస్త్రం ఫలించేనా? - తాజా వార్తలు బంగాల్​ ఎన్నికలు

తెలుగు భాషకు బంగాల్​లో అధికారిక గుర్తింపు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇది ఎన్నో ఏళ్లుగా ఖరగ్​పుర్​లో నివసించే తెలుగువారి కల. అయితే ఇంతకాలంగా ఈ విషయాన్ని పట్టించుకోని మమత సర్కార్​ ఆగమేఘాలపై తెలుగుకు గుర్తింపు ఇవ్వడం రాజకీయ విమర్శలకు తావిస్తోంది. అసలు బంగాల్​ ఎన్నికల బరిలో ఈ 'తెలుగు' ఆట ఏంటి?

Mamata
బంగాల్​ బరిలో 'తెలుగు' ఆట- దీదీ అస్త్రం ఫలించేనా?

By

Published : Dec 25, 2020, 12:52 PM IST

'తెలుగు భాషకు అధికార గుర్తింపు ఇవ్వండి' ఇది బంగాల్​లో నివసించే తెలుగు వాళ్లు ఎన్నో ఏళ్లుగా చేస్తోన్న డిమాండ్. ప్రభుత్వాలు మారినా.. నేతలు మారినా.. ఈ డిమాండ్​ను పట్టించుకున్న నాథులే లేరు. అయితే తాజాగా మమతా బెనర్జీ సర్కార్ తెలుగు భాషకు రాష్ట్రంలో అధికారిక గుర్తింపును ఇస్తూ లక్షలాది మంది తెలుగువాళ్ల కోరిక నెరవేర్చారు. ఇంతవరకు అంతా బాగనే ఉన్నా.. ఈ నిర్ణయం భాజపా, టీఎంసీ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలలకు ముందే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ కోణం ఉందని భాజపా విమర్శిస్తోంది. అసలు దీదీ నిర్ణయం వెనుక కారణమేంటి?

ఖరగ్​పుర్​ కథేంటి?

ఖరగ్​పుర్​.. రాష్ట్రంలో ఎక్కువ శాతం తెలుగువారు నివసించే ప్రాంతం. దాదాపు 1.5 లక్షల మంది తెలుగు వాళ్లు ఇక్కడ ఉంటారు. వీరిలో కనీసం 50 వేల మందికి ఓటు హక్కు ఉంది. ఖరగ్​పుర్​ సదార్​ అసెంబ్లీ నియోజకవర్గంలో 50 వేల ఓట్లు అంటే మాటలు కాదు. గెలుపోటములను శాసించే శక్తి వీరికి ఉంది. అందుకే దీదీ గురి ఇక్కడ పడిందన్నది భాజపా నేతల ఆరోపణ.

నిజానికి తెలుగు భాషకు అధికార గుర్తింపు రావడం ఇక్కడి తెలుగువారికి మేలు చేసేదే. ఎందుకంటే చాలా ప్రభుత్వ సంబంధిత పనులకు వారికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే సర్కార్​ నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

"ఈ నిర్ణయం వల్ల మాకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీని వెనుక ఉన్న రాజకీయ కోణాలతో మాకు పనిలేదు. మా డిమాండ్​ నెరవేరడం ఆనందంగా ఉంది."

- బీఎస్​ గిరి రావ్​, ఖరగ్​పుర్​లోని తెలుగు వ్యక్తి

భాజపా విమర్శలు..

అసెంబ్లీ ఎన్నికల్లో ఖరగ్​పుర్​ సదార్​ స్థానంలో భాజపా గెలుస్తుందనే భయంతోనే దీదీ ఈ 'తెలుగు' ఆట మొదలు పెట్టారని కమలనాథులు ఆరోపిస్తున్నారు.

"తెలుగు వారిపై మమతా బెనర్జీకి అంత శ్రద్ధ ఉంటే వారి డిమాండ్​ను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చేవారు. మరి ఇప్పుడు ఎందుకు ఇంత హడావుడిగా చేశారు? ఎందుకంటే వారికి ఇక్కడ ఓటమి భయం పట్టుకుంది. 2019 ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితాలు 2021లో వచ్చే అవకాశాలు లేవని వారికి తెలుసు. అయినప్పటికీ ఈ నిర్ణయం ఎన్నికల్లో కలిసి వస్తుందని వారు అనుకుంటే అది పొరపాటే."

- బీ సోమా, భాజపా నేత

భాజపా విమర్శలను టీఎంసీ తోసిపుచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న తెలుగువారి కలను మమత సర్కార్​ నేరవేర్చిందని, ఇందుకు సంతోషించాలని తృణమూల్​ నేతలు అంటున్నారు.

చాలా కీలకం..

ఖరగ్​పుర్​ అసెంబ్లీ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి ఓటర్లకు 1951 నుంచి అధికార పార్టీకి షాక్​ ఇవ్వడం ఆనవాయితీ.

  • 1951 ఎన్నికల్లో కాంగ్రెస్​ తరఫున ఇక్కడ మోమ్​తాజ్​ మౌలానా గెలుపొందారు. అప్పటి నుంచి 2019 వరకు ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థికి విజయం దక్కలేదు.
  • రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలో ఉన్న సమయంలో ఇక్కడ అప్పటి ప్రతిపక్ష పార్టీ సీపీఐ అభ్యర్థి గెలుపొందేవారు.
  • తరవాత వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్​ అభ్యర్థిని విజయం వరించేది.
  • ఈ ఆనవాయితీ 2016 ఎన్నికల వరకు కొనసాగింది. ఆ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి దిలీప్​ ఘోష్​ ఇక్కడ గెలుపొందారు.

చరిత్ర సృష్టించింది..

అయితే 2019 ఉపఎన్నికల్లో తృణమూల్​ కాంగ్రెస్​ ఖరగ్​పుర్​లో చరిత్ర సృష్టించింది. 42 ఏళ్లలో తొలిసారి అధికార పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించారు. అంతేకాకుండా 21 ఏళ్ల తృణమూల్​ పార్టీ చరిత్రలో ఈ నియోజకవర్గంలో గెలవడం ఇదే తొలిసారి. టీఎంసీ అభ్యర్థి ప్రదీప్​ సర్కార్ 21 వేల ఓట్ల తేడాతో ఈ చారిత్రక విజయాన్ని సాధించారు. పార్టీ ఓటింగ్​ షేర్​ 18 శాతానికి పెరిగింది.​

ఆయనే కారణం..

అయితే ఇంతటి ఘన విజయానికి కారణం 'సువేందు అధికారి'. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక ఎంపీ దిలీ ఘాష్​ సొంత నియోజకవర్గంలో కమలానికి షాక్​ ఇచ్చేలా వ్యవస్థాగతంగా టీఎంసీని బలపరిచారు సువేందు.

దీదీ ఎత్తుగడ..

అయితే తృణమూల్​ కాంగ్రెస్​లో మమత తర్వాత ఆ స్థాయి నేతగా గుర్తింపు పొందిన సువేందు భాజపాలో చేరడం టీఎంసీకి గట్టి షాక్​ ఇచ్చింది. ఫలితంగా 'అధికారి' వర్గం మద్దతును టీఎంసీ కోల్పోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ భాజపాకు చెక్​ పెట్టడానికి మమత 'తెలుగు' అస్త్రాన్ని ప్రయోగించారు. నియోజకవర్గంలో పార్టీకి తెలుగువారి మద్దతు దక్కితే 2021 అసెంబ్లీ స్థానం గెలవడం పెద్ద కష్టమేమీ కాదన్నది విశ్లేషకుల మాట. మరి భాజపాకు చెక్​ పెట్టడంలో దీదీ సఫలమయ్యారా? లేదా? అనేది చూడాలంటే 2021 అసెంబ్లీ ఎన్నికల వరకు వేచిచూడాల్సిందే.

(రచయిత- దీపాంకర్​ బోస్​, ఈటీవీ భారత్)

ABOUT THE AUTHOR

...view details