రాజకీయాల్లో తలపండిన ఎన్డీఏ దిగ్గజ నేతలు ఓవైపు.. వాళ్ల అనుభవమంత వయసు కూడా లేని 30 ఏళ్ల యువనేత మరోవైపు. ఇది బిహార్ ఎన్నికల బరిలో తాజా ముఖచిత్రం. సింపుల్‌గా చెప్పాలంటే ప్రస్తుతం బిహార్ రాజకీయం తేజస్వీ చుట్టూనే తిరుగుతోంది.
యువరక్తం...
తేజస్వీ యాదవ్... లాలూ తర్వాత ఆర్‌జేడీ లాంతర్ పట్టుకునే వాళ్లెవరా అని బిహార్‌లో జనం ఎదురుచూస్తున్న దశలో ముందుకొచ్చారు. మోదీ మేనియా, నితీశ్ విమర్శలను దీటుగా ఎదుర్కొంటూ పార్టీని ఎన్నికల రేసులో నిలిపారు. తన తండ్రి లాలూ ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో లేని లోటును భర్తీ చేసేందుకు ఈ యువ నేత శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే తేజస్వీ రానున్న రోజుల్లో ఓ విశ్వసనీయ నేతగా ఎదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జాతీయ స్థాయిలో మోదీకి ఉన్న ఇమేజ్ తెలియనిది కాదు. అయితే బిహార్‌లో ప్రస్తుతం తేజస్వీ యాదవ్ అదే స్థాయి ఇమేజ్ను సంపాదించారు. ఎందుకంటే ఇప్పుడు బిహార్ రాజకీయం అంతా 'తేజస్వీ x మిగిలిన నేతలు'గా నడుస్తోంది.
- ఇదీ చూడండి:9న లాలూ రిలీజ్- 10న నితీశ్‌కు ఫేర్వెల్'
2014 సీన్...
ప్రస్తుత బిహార్ రాజకీయం 2014లో జాతీయ స్థాయి రాజకీయాలను గుర్తుకు తెస్తోంది. అందుకు కారణం లేకపోలేదు.
యూపీఏ-2 ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, బయటపడ్డ కుంభకోణాలతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ సమయంలో నరేంద్ర మోదీ సుపరిపాలన, అవినీతి రహిత పాలన గురించి చెప్పడం ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్లింది. అదే భాజపా అనుకూల పవనాలు బలంగా వీచేలా చేసింది.
అయితే ఆ లోక్‌సభ ఎన్నికలకు ముందే 2012 నుంచి మోదీ మాట్లాడిన ప్రతిసారి అప్పటి ప్రధాని మన్మోహన్ తప్ప యూపీఏ నేతలందరూ ఆయనపై మాటల దాడికి దిగేవారు. గోద్రా అల్లర్లు, సతీమణిని మోదీ దూరంగా పెట్టారంటూ ఆయనపై వ్యక్తిగత విమర్శలకు సైతం వెనుకాడ లేదు.
అదే రీతిలో...
2014 లోక్‌సభ ఎన్నికలు మొత్తం మోదీ చుట్టూ ఎలా తిరిగాయో ఇప్పుడు 2020 బిహార్ శాసనసభ సమరం తేజస్వీ చుట్టూ తిరుగుతోంది. మోదీ నుంచి నితీశ్ వరకు ఎన్డీఏ నేతలందరూ తేజస్వీ పేరు లేకుండా ప్రసంగాన్ని పూర్తి చేయడం లేదు. తేజస్వీ చేసే విమర్శలపై ప్రతిదాడి చేస్తున్నారు. ఫలితంగా... అప్పటి వరకు ఎన్డీఏ నేతలకు విమర్శనాంశాలుగా ఉన్న లాలూ కుంభకోణాలు సహా ఇతర విషయాలు మరుగున పడిపోయాయి. తేజస్వీపై వ్యక్తిగత విమర్శలు చేసేందుకే నేతలు మొగ్గు చూపుతున్నారు. వ్యక్తిగత విషయాల జోలికి ఎప్పుడూ వెళ్లని నితీశ్ సైతం ఒక్కోసారి సహనం కోల్పోతున్నారు.
"తేజస్వీ యాదవ్ దిల్లీలో ఏం చేసేవారో నాకు తెలుసు. అయితే అవన్నీ చెప్పి నేను ఆయన పొలిటికల్ ఇమేజ్ను దెబ్బతీయాలనుకోవడం లేదు."