సమోసాలో ఆలూ ఉన్నంతవరకు బిహార్‌లో లాలూ ఉంటారని.. రాజకీయాలను ఉద్దేశించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పుడూ చెబుతుండే మాట ఇది. కానీ ప్రస్తుతం బిహార్ ఎన్నికల్లో.. అన్నీ ఉన్నా లాలూ ఎక్కడా కనిపించటం లేదు. జైలులో ఉండే లాలూ వ్యవహరాలు చక్కబెడుతున్నారని చెబుతున్నా.. బయట పార్టీ బాధ్యత మొత్తం ఆయన కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ మీదే పడింది. ఈ నేపథ్యంలో వారు పోటీ చేసే స్థానాలకు అమితమైన ప్రాధాన్యం ఏర్పడింది.
ఇదీ చూడండి: బిహార్ బరి: కంచు కోటలపై పట్టు నిలిచేనా?
హసన్‌పూర్‌లో నామినేషన్
మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిన్న కుమారుడు తేజస్వీ ఉండగా.. పార్టీ కీలక బాధ్యతల్లో తేజ్ ప్రతాప్ ఉన్నారు. బిహార్‌లో వీరి కుటుంబానికి కంచుకోటల్లాంటి కొన్ని నియోజకవర్గాలున్నాయి. సాధారణంగా కుటుంబ సభ్యులంతా ఆ స్థానాల నుంచే పోటీ చేస్తుంటారు. ప్రస్తుత ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం రఘోపూర్ నుంచే తేజస్వీ బరిలోకి దిగుతుండగా.. తేజ్ ప్రతాప్ సిట్టింగ్ స్థానం మహువా నుంచి కాకుండా హసన్పూర్ స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. నామినేషన్ కూడా వేసేశారు. ఇది బిహార్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐశ్వర్య వల్లే?
మాజీ భార్య ఐశ్వర్యా రాయ్ కారణంగానే తేజ్‌ప్రతాప్ నియోజకవర్గం మార్చినట్లు ప్రత్యర్థి వర్గాలు కోడై కూస్తున్నాయి. శాసనసభ్యుడు చంద్రికా రాయ్ కుమార్తె.. ఐశ్వర్యను కొన్నాళ్ల కింద వివాహం చేసుకున్నారు తేజ్‌ప్రతాప్ యాదవ్. కానీ, పొరపొచ్చాలు వచ్చి కొన్ని రోజులకే వేరుపడ్డారు. అప్పట్లో ఈ వివాదం రచ్చకెక్కింది. తర్వాత లాలూ కుటుంబానికి దూరం జరిగిన చంద్రికా రాయ్.. జేడీయూ తీర్థం పుచ్చుకున్నారు. సిట్టింగ్ స్థానం పార్సా నుంచే మరోసారి పోటీలో నిలిచారు.
ఈ నేపథ్యంలో తేజ్‌ప్రతాప్ మహువా స్థానం నుంచి తప్పుకున్నారు. ఐశ్వర్య రాయ్‌ను ఇక్కడ ఆయనకు పోటీకి దింపుతున్నారన్న ఊహాగానాలే ఇందుకు కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్సాకు కూతవేటు దూరంలోనే ఉన్న మహువా నియోజకవర్గంలో చంద్రికా రాయ్ కుటుంబానికి గట్టి పట్టుంది.