తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రయాన్​-2: సాఫ్ట్ ల్యాండింగ్​లో సమస్య!

భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్​-2లోని అత్యంత కీలక ఘట్టంలో సమస్య తలెత్తింది. చంద్రుడి ఉపరితలంపై దిగుతుండగా ల్యాండర్ విక్రమ్​తో ఇస్రో కేంద్రానికి సంబంధాలు తెగిపోయాయి. విక్రమ్​ సంకేతాల కోసం ​ఎదురుచూస్తున్నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

చంద్రయాన్​-2: విక్రమ్ ల్యాండింగ్​లో సమస్య!

By

Published : Sep 7, 2019, 2:25 AM IST

Updated : Sep 29, 2019, 5:41 PM IST

2.1 కిలోమీటర్లు... ఇది పెద్ద దూరమే కాదు అనిపించకపోవచ్చు. కానీ ఇప్పుడిది భారతీయులకు గుర్తుండిపోయే సంఖ్య. ఈ దూరంలోనే ల్యాండర్​ విక్రమ్​తో భారత అంతరిక్ష కేంద్రం(ఇస్రో)కు సంబంధాలు తెగిపోయాయి.

చంద్రయాన్​-2 ప్రయోగం అంతా సజావుగా సాగుతుందని అనుకున్న సమయంలో ఊహించని పరిణామం ఎదురైంది. చివరి నిమిషంలో సమస్య ఎదురవడం వల్ల అప్పటికే ఉన్న ఉత్కంఠ మరింత పెరిగింది. శాస్త్రవేత్తల్లో ఏదో తెలియన ఒత్తిడి కనిపించింది. నిర్దేశిత ల్యాండింగ్​ సమయం గడిచిపోయినప్పటికీ.. ల్యాండర్​ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడం వల్ల అసలేం జరుగుతోందో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

ఆ సమయంలో... చంద్రయాన్​-2లోని అతి కీలక ఘట్టాన్ని ప్రపంచ వైజ్ఞానిక లోకం మొత్తం వీక్షిస్తోంది. దేశ నలుమూలల నుంచి ఎంపిక చేసిన 60 మంది విద్యార్థులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు ఇస్రో కేంద్రంలో ఉన్నారు. సమస్యను గుర్తించిన వెంటనే ఇస్రో ఛైర్మన్​ కె. శివన్... ల్యాండర్​ పరిస్థితిని ప్రధానికి వివరించారు. కాసేపటికి అధికారిక ప్రకటన చేశారు. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్​తో ఇస్రో కేంద్రానికి సంబంధాలు తెగిపోయినట్లు వెల్లడించారు. డేటా మొత్తాన్ని విశ్లేషించి, ఏం జరిగిందో తెలుసుకుంటామని చెప్పారు శివన్.

ల్యాండింగ్​లో సమస్యతో శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. వారందరికీ ధైర్యం చెప్పారు ప్రధాని. జీవితంలో ఉత్థానపతనాలు సహజమని, విశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Last Updated : Sep 29, 2019, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details