అధిక విలువ కలిగిన లావాదేవీలను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్నులలో చూపించాల్సిన అవసరం లేదని ఆ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.
రూ. 20 వేలకు పైబడిన హోటల్ చెల్లింపులు, రూ. 50 వేల కన్నా ఎక్కువ జీవిత బీమా ప్రీమియం, రూ. 20 వేలకుపైన వైద్య బీమా ప్రీమియం, లక్షకు మించిన పాఠశాలల ఫీజుల వంటి ఆర్థిక లావాదేవీల వివరాలను రిటర్నులలో ప్రస్తావించాలనే ప్రతిపాదన జరుగుతున్నట్లు వచ్చిన వార్తలను అధికారులు ఖండించారు.
"ఆదాయపు పన్ను రిటర్నుల ఫారాలను సవరించే ప్రతిపాదన లేదు. అధిక విలువ కలిగిన లావాదేవీలను పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులలో పొందుపర్చాల్సిన అవసరం లేదు."
-అధికార వర్గాలు
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అధిక విలువ కలిగిన లావాదేవీలను తృతీయ పక్షం(థర్డ్ పార్టీ) ఆర్థిక సంస్థలే ఐటీ శాఖకు నివేదిస్తాయి. అయితే ఈ సమాచారం పన్ను చెల్లించని వ్యక్తులను గుర్తించేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని, అంతేకానీ, నిజాయతీ పన్ను చెల్లింపుదారుల వ్యవహారాలను పరిశీలించేందుకు కాదని అధికారులు స్పష్టం చేశారు.