అనారోగ్యంతో కన్నుమూసిన అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయి అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. గువాహటిలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా తెలిపారు. గొగొయి మృతదేహాన్ని మంగళవారం దిస్పూర్లోని ఆయన అధికారిక నివాసానికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. అనంతరం రాష్ట్ర సచివాలయమైన జనతా భవన్‌కు, తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి ఆయన పార్థివదేహాన్ని తరలించనున్నట్లు చెప్పారు.
గొగొయిని చివరిసారి సందర్శించుకునేందుకు ప్రజలకు ఒకరోజు అవకాశం ఇవ్వాలని ఆయన కుటుంబ సభ్యులు కోరారని... వీరి అభ్యర్థన మేరకు శ్రీమాంత శంకరదేవ కళాక్షేత్ర కాంప్లెక్స్‌లో ప్రభుత్వం ఇందుకు ఏర్పాట్లు చేస్తోందని బోరా తెలిపారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారమంతా గొగొయి పార్థివదేహాన్ని ఈ కళాక్షేత్రంలోనే ఉంచనున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ సహా ఇతర ప్రముఖులు సమయంలో గొగొయిని చివరిసారి దర్శించుకునే అవకాశం ఉందని చెప్పారు.
నవంబర్ 26న గొగొయి అంతిమయాత్ర కళాక్షేత్రం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. స్వస్థలం టిటాబోర్ అయినప్పటికీ.. ఆయన అత్యక్రియలు మాత్రం గువాహటిలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. గొగొయి చివరి కోరిక ప్రకారం ఆయన భౌతికకాయాన్ని గుడి, చర్చి, మసీదుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
సంతాప దినాలు
గొగొయి మృతి నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్‌తో పాటు అధికార భాజపా సైతం అన్ని రకాల పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకుంది. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారాన్ని మూడు రోజులు వాయిదా వేసుకుంది.