తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కార్గిల్​, బాలాకోట్​పై ధనోవా చెప్పిన ఆసక్తికర విషయాలు - balakot

గ్వాలియర్​ వైమానిక స్థావరంలో కార్గిల్​ యుద్ధం స్మరణార్థం వైమానికదళం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాయుసేన చీఫ్ మార్షల్​ బీఎస్​ ధనోవా ఆనాటి యుద్ధ విశేషాలను వెల్లడించారు. మిరాజ్​-2000 ఆధునికీకరణే విజయాన్ని సాధించిపెట్టిందని తెలిపారు.

ధనోవా

By

Published : Jun 24, 2019, 1:16 PM IST

Updated : Jun 24, 2019, 5:08 PM IST

ఎయిర్​ చీఫ్ మార్షల్​ బీఎస్ ధనోవా

కార్గిల్​ యుద్ధానికి 20ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో గ్వాలియర్​ వైమానిక స్థావరంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాయుసేన చీఫ్​ మార్షల్​ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో యుద్ధం నాటి ముఖ్య ఘట్టాలను వీడియోల రూపంలో ప్రదర్శించారు.

కార్గిల్​ యుద్ధ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత వాయుసేనకు సంబంధించిన పలు అంశాలను తెలిపారు ధనోవా. యుద్ధంలో విజయం సాధించేందుకు ఆయుధాలను వేగంగా ఆధునికీకరించామని తెలిపారు.

"కీలక సమయంలో విజయం కోసం మిరాజ్​-2000 ను అప్​గ్రేడ్​ చేశాం. లైటెనింగ్​ లేజర్​ డెసిగ్నేటింగ్ భాగం, లేజర్ గైడెడ్​ బాంబ్​లను 12 రోజుల రికార్డు సమయంలో అమర్చాం. ఈ కృషి ఫలితమే యుద్ధాన్ని భారత్​ వైపునకు తిప్పింది."

-బీఎస్ ధనోవా, ఎయిర్​ చీఫ్ మార్షల్

కార్గిల్​ యుద్ధం విజయంలో మిరాజ్​-2000 కీలక పాత్ర పోషించింది. టైగర్​ హిల్​లో శత్రు స్థావరాలు, యుద్ధ ట్యాంకర్లపై విరుచుకుపడింది.

ఈ యుద్ధం ఎప్పటికీ ప్రత్యేకమే..

కార్గిల్​ యుద్ధం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ధనోవా పేర్కొన్నారు. యుద్ధ వ్యూహాలు, ఆశ్చర్యకర సంఘటనలు, అకస్మాత్తు దాడులు, కార్గిల్​ - సియాచిన్​ దాటి దేశం లోపలికి ప్రభావం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయన్నారు. త్రివిధ దళాల వ్యూహాలు, ప్రణాళికలతో అద్భుత విజయాన్ని సాధించామని ఉద్ఘాటించారు ధనోవా.

కార్గిల్​ దివస్​

జులై 26తో కార్గిల్​ యుద్ధం ముగిసి 20 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో దిల్లీతో పాటు జమ్ము కశ్మీర్​లోని ద్రాస్​లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని సైన్యం నిర్ణయించింది. జులై 25-27 మధ్య మూడు రోజల పాటు ఈ వేడుకలు జరుగుతాయి.

లక్ష్యాల్లో తేడా..

బాలాకోట్​ దాడుల్లో ఉగ్రవాదులే భారత్​ ప్రధాన లక్ష్యమని ధనోవా ఉద్ఘాటించారు.

"బాలాకోట్​ విషయంలో చెప్పాలంటే మన గగనతలంలోకి పాక్​ చొరబడలేదు. మన లక్ష్యం బాలాకోట్​లోని ఉగ్రవాదులపైనే.. దాన్ని మనం సాధించాం. వారి లక్ష్యం మాత్రం భారత సైన్య స్థావరాలే. ఆ విషయంలో వాళ్లు విఫలమయ్యారు. నియంత్రణ రేఖ దాటి ఎవరూ భారత్​లో ప్రవేశించలేదు."

-బీఎస్​ ధనోవా, ఎయిర్​ చీఫ్ మార్షల్

'ఎన్​-32కు మరో ప్రత్యామ్నాయం లేదు'

ఇటీవల అరుణాచల్​ ప్రదేశ్​లో కూలిపోయిన యుద్ధవిమాన శ్రేణి ఎన్​-32పైనా స్పందించారు ధనోవా. పర్వత ప్రాంతాల్లో ఈ యుద్ధవిమానాలు ఇంకా సేవలందిస్తాయని స్పష్టం చేశారు. మరో ప్రత్యామ్నాయం లేదని తెలిపారు. అయితే అత్యాధునిక యుద్ధవిమానాల కొనుగోలు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

ఇదీ చూడండి: 'భాజపా.. ఉగ్రవాద సంస్థలా వ్యవహరిస్తోంది'

Last Updated : Jun 24, 2019, 5:08 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details