వీణానాదం సంగీతాభిమానుల చింతను దూరం చేస్తుంది. మధురానుభూతిలో ఓలలాడిస్తుంది. దేశంలోని ఇతరప్రాంతాల్లో తయారయే వీణల కంటే తంజావూరు వీణనే వాడమని, సంగీతకారులు సూచిస్తారు. చెక్కతో తయారు చేసే తంజావూరు సరస్వతీ వీణ ప్రత్యేకతే వేరు. సంగీతకళారంగంలో అంత ప్రత్యేకత సొంతం చేసుకున్న దీని గురించి తెలుసుకోవటానికి తంజావూరుకు వెళ్లింది ఈటీవీ భారత్.
ఎలాంటి హంగులూ లేని ఓ చిన్న గదిలో.. పనస కలపతో ఈ వీణలు చేత్తో తయారు చేస్తున్నారు. మూడు భాగాల కలయికతో రూపుదిద్దుకునే వీణలో.. మొదటి భాగాన్ని కుండ అంటారు. ఇదంతా ఒక కలపముక్కతోనే తయారవుతుంది. రెండోది దండి, మూడోది యాళి ముఖం.
ఏకాంత వీణగా పిలిచే సమకాలీన వాద్య పరికరం ఆకృతి ఇది. 52 అంగుళాల పొడవుతో, 8 కిలోల బరువుంటుంది ఈ వీణ. మునుపటి ఒట్టు వీణ.. 3 విడిభాగాలను అతికించడం ద్వారా తయారు చేసేవాళ్లమని తంజావూరు సరస్వతి వీణ రూపకర్త కళియమూర్తి చెబుతున్నారు.
"ఎప్పటికప్పుడు వీణ డిజైన్ మారుస్తుంటాం. వినియోగదారులకు కావల్సినట్లుగా దేవతలు, పూల బొమ్మలు వీణపై చిత్రిస్తాం".
-కళియమూర్తి, వీణ రూపకర్త
దండిపై ఉండే 24 ఇత్తడి తీగలపై స్వరాలు పలికిస్తే.. వీణపైభాగంలో ఉండే రంధ్రాల నుంచి సంగీతం పుడుతుంది. ఈ తీగలపై ఏదైనా అపశ్రుతి ఉన్నా, స్వరాలు వాటంతట అవే సరి చేసుకుంటాయయని డిజైనర్లు చెబుతున్నారు.