మహారాష్ట్ర, తమిళనాడుపై కరోనా పంజా.. రికార్డ్ స్థాయిలో కేసులు
మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 3500లకుపైగా, తమిళనాడులో 2,300లకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ ధాటికి దేశం విలవిలలాడుతోంది. మహారాష్ట్ర, తమిళనాడులో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మాహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,874 మంది వైరస్ బారినపడ్డారు. 160 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,28,205కి, మృతుల సంఖ్య 5,984కు చేరింది.
ముంబయిలో...
మహారాష్ట్రలో వైరస్ విజృంభిస్తోంది. మహా నగరం ముంబయిలో శనివారం ఒక్కరోజే 136 మరణాలు నమోదయ్యాయి. దీంతో నగరంలో ఇప్పటివరకు 3,559 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ముంబయిలో తాజాగా 1,197కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 65,265కు చేరింది.
అయితే ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారావిలో శనివారం కేవలం 7 కేసులే నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇదే అత్యల్పమని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 2,158 మందికి కరోనా సోకింది. 80 మంది మరణించారు.
తమిళనాడులో..
తమిళనాడులో శనివారం ఒక్కరోజే 2,396 కేసులు నమోదయ్యాయి. వరుసగా నాలుగో రోజూ కొత్త కేసుల సంఖ్య 2 వేలు దాటింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 56,845కు చేరింది. తాజాగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ సోకి ఇప్పటివరకు 704 మంది మృతి చెందారు.
గుజరాత్లో...
గుజరాత్లో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా 539 మందికి వైరస్ సోకినట్టు నిర్థరణ అయ్యింది. మొత్తం 26,737 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజులో 20 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,639కి పెరిగింది.
రాజస్థాన్లో...
రాజస్థాన్లోనూ కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 381 తాజా కేసులతో ఇప్పటివరు 14,537 మంది కరోనా బారినపడ్డారు. శనివారం నలుగురు బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 337కు చేరింది.