కరోనా మహమ్మారితో పోరాడుతూ తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ హెచ్.వసంత కుమార్ కన్నుమూశారు. కరోనా చికిత్స కోసం ఈ నెల 10న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఆరోగ్యం క్షీణించడం వల్ల శుక్రవారం సాయంత్రం మరణించారు.
కన్యాకుమారి పార్లమెంట్ స్థానం నుంచి నేతృత్వం వహిస్తున్న వసంత కుమార్ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజకీయ నాయకుడే కాక పారిశ్రామిక వేత్త కూడా. వసంత్ అండ్ కో పేరుతో చైన్ స్టోర్స్, వసంత్ టీవీని కూడా నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ విచారం...
వసంత కుమార్ అకాల మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ విచారం వ్యక్తం చేసింది. ప్రజల మన్నన పొందిన వ్యక్తి అని... ఆయన మరణం పార్టీకి తీరనిలోటు అని పేర్కొంది. ఆయన మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు సంతాపం తెలిపారు.