వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారిని చూసి కొందరు బెంబేలెత్తిపోతున్నారు. మరికొందరు లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమై ఒంటరితనం, ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ అనవసర ఆందోళనలకు చెక్ పెట్టి, మనస్సును నిశ్చలంగా ఉంచుకునేందుకు ఓ ఉపాయం చెబుతున్నారు.. ప్రపంచ ప్రఖ్యాత ధ్యానగురువు, రచయిత దీపక్ చోప్రా. మనసుకు నచ్చినవారితో ఎక్కవ సేపు మాట్లాడడం వల్ల కరోనా ఒత్తిడిని జయించవచ్చు అంటున్నారు.
"ఈ గజిబిజి జీవితాల్లో ఓ ఫోన్‌కాల్ రెండు మూడు నిమిషాలు మాట్లాడే సమయం కూడా దొరకట్లేదు. కానీ, సామాజిక దూరం వల్ల ఇప్పుడు ఆ సమయం ఉంది. మీకు నచ్చిన కుటుంబ సభ్యుడితోనో, స్నేహితుడితోనో గంటల తరబడి మాట్లాడి ఫలితాన్ని పొందండి. అయితే వారితో వైరస్ గురించి ఎక్కువగా మాట్లాడొద్దు. ప్రతి ఒక్కరిలో ఏదో ఓ స్థాయిలో శాంతి, నిశ్చలత్వము ఉంటుంది. దానిని వీలైనంత ఎక్కువమంది అనుభవించాలి. వైరస్‌ను జయించే సానుకూల పరిష్కారం కనుగొనకపోతే, ఇక దాని గురించి చింతించి ప్రయోజనం ఏమిటి? ఇలాంటి సమయంలోనే మనం మరింత దృఢమైన వ్యక్తుల్లా మారాలి."