తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'తాలిబన్లకు కశ్మీర్​పై ఎలాంటి ఆసక్తి లేదు' - అఫ్గాన్ సంబంధాలు అమర్ సిన్హా

కశ్మీర్​ వివాదంపై తాలిబన్లకు ఎలాంటి ఆసక్తి లేదని భారత మాజీ రాయబారి అమర్ సిన్హా అభిప్రాయపడ్డారు. కశ్మీర్​ వ్యవహారాన్ని భారత అంతర్గత విషయంగానే తాలిబన్లు పరిగణిస్తున్నారని వెల్లడించారు. కశ్మీర్​పై తాలిబన్లు చేసినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో సిన్హా ఈ మేరకు స్పష్టతనిచ్చారు. దీంతో పాటు అఫ్గాన్​ శాంతి స్థాపనలో భారత్ పాత్ర సహా కొన్ని ముఖ్యమైన విషయాలపై ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు.

Amar Sinha
అమర్ సిన్హా

By

Published : May 23, 2020, 3:31 PM IST

భారత్​-పాకిస్థాన్​ మధ్య కశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు భారత్​తో సత్సంబంధాలు నెలకొల్పే అవకాశం లేదని తాలిబన్ ముఖ్య నేత షేర్ ముహమ్మద్ అబ్బాస్ స్టానిక్జయ్ వ్యాఖ్యానించినట్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం సాగింది. అఫ్గానిస్థాన్​కు సంబంధించినంత వరకు భారత్​ ప్రతికూల పాత్ర పోషిస్తోందని అబ్బాస్ పేర్కొన్నట్లు పోస్టులు వెల్లువెత్తాయి. అయితే తాలిబన్లకు కశ్మీర్ సమస్యపై ఎలాంటి ఆసక్తి లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కశ్మీర్​ భారత అంతర్గత వ్యవహారంగానే తాలిబన్ పరిగణిస్తోందని స్పష్టం చేస్తున్నారు.

అఫ్గానిస్థాన్​కు భారత మాజీ రాయబారి అమర్ సిన్హా ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు. కశ్మీర్​పై, కశ్మీర్ వివాదంపై తాలిబన్లు ఇప్పటివరకు ఆసక్తి కనబర్చలేదని, పాకిస్థాన్​కు చెందిన కొన్ని వర్గాలే వారిని ప్రేరేపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

ఈటీవీ భారత్ ప్రతినిధి స్మితా శర్మతో అమర్​ సిన్హా ముఖాముఖి

"ఆర్టికల్ 370 రద్దు సమయంలోనూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి అనవసర రాద్దాంతం చేశారు. ఈ చర్య దోహాలో శాంతి చర్చలకు విఘాతం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. అయితే అప్పుడు కూడా ఆర్టికల్ రద్దు భారత్​ అంతర్గత విషయమేనని తాలిబన్ ప్రతినిధులు స్పష్టం చేశారు."

--అమర్ సిన్హా, అఫ్గానిస్థాన్​కు భారత మాజీ రాయబారి

2018 మాస్కోలో తాలిబన్లతో జరిగిన సమావేశంలో భారత్​ తరపున అనధికార ప్రతినిధులుగా హాజరైన ఇద్దరిలో సిన్హా ఒకరు. మరొకరు అప్పటి భారత సైన్యాధిపతి బిపిన్ రావత్.

శాంతి స్థాపనకు కృషి చేసే ఒప్పందమే

తాలిబన్లు, అమెరికాకు మధ్య జరిగిన ఒడంబడిక... శాంతి ఒప్పందం కాదని పేర్కొన్నారు సిన్హా. అఫ్గాన్​లో శాంతి స్థాపనకు కృషి చేస్తామని చేసుకున్న ఒప్పందం అని తెలిపారు. అఫ్గాన్​ ప్రభుత్వంతో అంతర్గతంగా చర్చలు జరిపిన తర్వాతే శాంతి స్థాపన జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 29న జరిగిన ఒప్పందం అమెరికా బలగాల ఉపసంహరణ గురించేనని చెప్పారు. తాలిబన్​ ఖైదీలను విడుదల చేయడం, అఫ్గాన్​లో తాలిబన్ల కదలికలపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయడానికి సంబంధించిన అంశాలతో ఈ ఒప్పందం ముడిపడి ఉందని తెలిపారు.

ప్రస్తుతం అఫ్గాన్​లో అంతర్గత చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు సిన్హా. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, అబ్దుల్లా ప్రమాణస్వీకారం(మార్చి 9న) చేసిన తర్వాతి రోజు నుంచే చర్చలు ప్రారంభించడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు.

అయితే అఫ్గాన్​ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణకు గడువు నిర్ణయించినప్పటికీ.. అఫ్గాన్-తాలిబన్ల ద్వైపాక్షిక చర్చలు పూర్తి చేసే అంశంపై ఒప్పందంలో ఎలాంటి నిబంధనలు లేవని అన్నారు సిన్హా.

ఆ విషయం తాలిబన్లు నిరూపించుకోవాలి

తాలిబన్లతో ప్రత్యక్ష చర్చలకు భారత్​ సంసిద్ధతపై చర్చించే ముందు.. తాలిబన్లు కొన్ని విషయాల్లో తమను తాము నిరూపించుకోవాలని సిన్హా పేర్కొన్నారు. అఫ్గాన్ పౌరులను హతమార్చుతూ హింసకు పాల్పడటం మానుకోవాలని అన్నారు. పూర్తి రాజకీయ శక్తిగా మారినట్లు నిరూపించుకోవాలని వ్యాఖ్యానించారు.

మరోవైపు భారత్​ తన సొంత విధివిధానాలు పాటిస్తూనే పొరుగు దేశాల్లో మంచి ఫలితాలు రాబట్టడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు సిన్హా. చర్చల్లో తప్పనిసరిగా భారత్​ జోక్యం చేసుకోవాలన్న ఇతరుల వైఖరి సరికాదని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఆసియాలో బలమైన ప్రాంతీయ శక్తిగా ఎదగాలన్న భారత్ ఆకాంక్షలకు గండి పడుతుందన్నారు.

అఫ్గాన్​ పునర్నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించే అవకాశం భారత్​ ముందు ఉందన్నారు సిన్హా. ప్రజాస్వామ్య అఫ్గాన్​ విధానానికి మద్దతు ఇవ్వడం, అఫ్గాన్ విషయంలో తటస్థంగా వ్యవహరించడం, రాజకీయ నాయకత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండటం ద్వారా భారత్​ ఈ విషయం స్పష్టం చేస్తోందన్నారు.

అఫ్గాన్ విషయంలో క్రియాశీలంగానే

అఫ్గాన్ విషయంలో భారత్​ కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తుందని అనడం సరికాదని సిన్హా పేర్కొన్నారు. అన్ని సమయాల్లో భారత ప్రభుత్వం కేవలం చూస్తూ ఉండిపోదని, తెరవెనక చాలా విషయాలు జరుగుతాయని వెల్లడించారు. దౌత్యవేత్తలు, ఇతర అధికారులు క్రియాశీలంగానే ఉన్నారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. కొన్ని విషయాలు పాత స్నేహితుల ద్వారా ప్రారంభించడమే ఉత్తమమని వ్యాఖ్యానించారు. భారత్​కు చాలా మంది మిత్రులు ఉన్నందున ఒకే వైపు నిలబడటం సాధ్యం కాదని పేర్కొన్నారు.

ఐసిస్​తో పోరాడొచ్చు కదా!

అఫ్గాన్-తాలిబన్లు కలిసి ద్వైపాక్షిక చర్యల ద్వారానే ఈ సమస్య పరిష్కరించుకోవాలని హితవు పలికారు. ఉగ్రవాదం నుంచి తాలిబన్లు పూర్తిగా బయటకు వచ్చేయాలని పేర్కొన్నారు. అఫ్గాన్​ పౌరులను బలితీసుకుంటున్న ఐఎస్​ఐఎస్​ను తమ శత్రువుగా పరిగణించినప్పుడు.. దేశంలోని 30 శాతం భూభాగం తమ ఆధీనంలో ఉన్న తాలిబన్లు అఫ్గాన్​ సైన్యంతో కలిసి ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు.

సయోధ్యకు పాక్ సిద్ధమేనా?

అఫ్గాన్​ను పాకిస్థాన్ దృష్టి కోణంతో కాకుండా సొంత దృక్పథంతోనే చూడాలని సిన్హా స్పష్టం చేశారు. తమ పౌరుల ప్రాణాలను పణంగా పెట్టి 18ఏళ్లుగా పాక్ ఒకే విధాన్ని అవలంభించిందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పాక్ చివరి దశకు చేరుకుందని అన్నారు. అయితే తాలిబన్లను విడిచిపెట్టి, అఫ్గాన్​లో సయోధ్య కుదిరేందుకు మద్దతిస్తారా అనే విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్యానించారు.

అందుకు భారత్​ సిద్ధంగా ఉండాలి

ఒకవేళ తాలిబన్లు జాతీయవాద దృష్టితో వ్యవహరిస్తే భారత్ తన విధానాల్లో ఎలాంటి మార్పు లేకుండా అఫ్గాన్​తో పాత విధివిధానాలే కొనసాగించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు సిన్హా. గత 18 ఏళ్లుగా అఫ్గాన్​తో భారత్​కున్న సంబంధాలను తాలిబన్లు స్వాగతిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. దెలారామ్-జరంగ్ రహదారి మినహా అఫ్గాన్​లో భారత్​ చేపట్టిన ఏ ప్రాజెక్టులపైనా తాలిబన్లు దాడి చేయలేదని తెలిపారు. పార్లమెంట్ భవనం, సాల్మ డ్యాం నిర్మాణానికీ తాలిబన్లు విఘాతం కలిగించలేదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details