దోహాలో అమెరికా, అఫ్గాన్ తాలిబన్ల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రాంతీయ భద్రత, సుస్థిరతలను ప్రభావితం చేయనుంది. దీర్ఘకాలంలో భారత్‌పై ప్రభావం సానుకూలంగా ఉంటుందా లేక ప్రతికూలంగానా అన్నది ముఖ్యమైన ప్రశ్న. కేవలం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రయోజనాల కోసమే ఆదరాబాదరాగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ఒప్పంద పీఠికను చూస్తే చాలు అందులో ఉన్న మెలిక అర్థమైపోతుంది. ‘తాలిబన్‌గా సుపరిచితమైన అఫ్గానిస్థాన్ ఇస్లామిక్ ఎమిరేట్‌ను ఒక రాజ్య వ్యవస్థగా అమెరికా సాధికారికంగా గుర్తించడం లేదు. అయినా అఫ్గానిస్థాన్‌లో శాంతి సాధనకు వారితో అమెరికా 2020 ఫిబ్రవరి 29న ఒప్పందం కుదుర్చుకుంది’ అని ఒప్పంద పీఠికలో స్పష్టంగా పేర్కొన్నారు. దీన్నిబట్టి ఒప్పందం తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉందంటే తప్పు లేదు.
ఈ శాంతి ఒప్పంద సారమేమంటే
‘అమెరికా, దాని మిత్రదేశాల భద్రతకు ముప్పు తీసుకురావడానికి అఫ్గాన్ గడ్డను ఏ బృందం కానీ, వ్యక్తి కానీ ఉపయోగించకుండా తాలిబన్ నిరోధిస్తుంది. అందుకు బదులుగా అఫ్గానిస్థాన్ నుంచి ఒక గడువులోగా అన్ని విదేశీ సేనల ఉపసంహరణకు అనుసరించే పద్ధతి క్రమాన్ని, భరోసాలను అమెరికా ప్రకటిస్తుంది’ అని. చిత్రమేమిటంటే తాలిబన్ల ఇస్లామిక్ ఎమిరేట్‌ను అమెరికా గుర్తించనట్లే, ప్రజాస్వామికంగా ఎన్నికైన అఫ్గాన్ ప్రస్తుత ప్రభుత్వాన్నీ తాలిబన్లు గుర్తించకపోవడం. అందువల్లనే శాంతి ఒప్పందంలో అఫ్గాన్ ప్రజాతంత్ర ప్రభుత్వ ఊసే లేకుండా పోయింది. 2001 సెప్టెంబరు 11న అమెరికాపై ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా అఫ్గానిస్థాన్‌లోని అల్ ఖైదా, వారి వత్తాసుదారులైన తాలిబన్లపై అమెరికా సంకీర్ణ సేనలు విరుచుకుపడ్డాయి. అమెరికా-తాలిబన్ పోరుకు భారత్ దూరంగా ఉండిపోయినా, ఆ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్లూనుకోవడానికి మాత్రం తన వంతు సాయం అందిస్తూ వచ్చింది. అంతకుముందు, అంటే 1999 డిసెంబరులో భారతీయ పౌర విమానం హైజాక్, అందులోని ప్రయాణికులను విడచిపెట్టినందుకు బదులుగా కొందరు ఉగ్రవాద ఖైదీలను విడుదల చేయాల్సి వచ్చిన ఉదంతంలో తాలిబన్ల పాత్రను భారత్ మరచిపోలేదు.
1990లలో తాలిబన్లు రంగం మీదకు వచ్చినప్పటి నుంచి వారికి పాకిస్థాన్ సైన్యం పూర్తి అండదండలిస్తూ వచ్చింది. భారత్ అనుసరించిన అఫ్గాన్ విధానాన్ని ఈ అంశం ప్రభావితం చేసింది. 1979లో అఫ్గానిస్థాన్ పై సోవియట్ యూనియన్ దండయాత్ర చేసింది. సోవియట్లపై 1980వ దశకంలో ముజాహిదీన్‌లు పోరాటం ప్రారంభించగా, అమెరికన్లు వారికి వత్తాసు ఇచ్చారు. ఈ పోరుకు పాకిస్థాన్ అన్ని విధాలా సహకరించింది. రోనాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సోవియట్లతో ప్రచ్ఛన్న యుద్దాన్ని ఈ విధంగా ముమ్మరం చేశారు. అమెరికా-సోవియట్ వైరం, సౌదీ-ఇరాన్ మత భేదాలు, జిహాదీలకు పాకిస్థాన్ అండదండలు, బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్‌ఐ) కింద నిర్మితమవుతున్న చైనా పాకిస్థాన్ ఆర్థిక నడవా (సిపెక్)- ఇవన్నీ భారతదేశ విదేశాంగ, భద్రతా విధానాలను ప్రభావితం చేస్తూ వచ్చాయి. తాజాగా అమెరికా-తాలిబన్ల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పలేం. అందుకే భారతదేశం ఈ ఒప్పందం పట్ల ఆచితూచి స్పందించింది. ‘అఫ్గానిస్థాన్‌లో శాంతి, భద్రత, సుస్థిరతలను పునరుద్ధరించడానికి ఏ అవకాశం దొరికినా భారత్ పూర్తిగా సమర్థిస్తుంది. అక్కడ హింసాకాండ, అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలు అంతమవడానికి శాశ్వత రాజకీయ పరిష్కారం లభించాలని ఆశిస్తోంది. ఈ పరిష్కారమనేది అప్గాన్ల నియంత్రణలో, అఫ్గాన్ల నాయకత్వంలో సిద్ధించాలని కోరుకుంటోంది’ అని దిల్లీ ప్రకటించింది.
ఆరాటంలో అఫ్గాన్ పౌరుల కష్టాలను విస్మరించింది