చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తంచేశారు. మన శాస్త్రవేత్తల సామర్థ్యానికి, వైజ్ఞానిక రంగంలో నూతన శిఖరాలకు చేరాలన్న 130కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ఈ ఘట్టం నిదర్శనమని ట్వీట్ చేశారు.
చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం... - ల్యాండర్
15:25 July 22
మోదీ హర్షం
15:09 July 22
ఇస్రో శాస్త్రవేత్తల హర్షాతిరేకాలు
చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అంతరిక్ష చరిత్రలో భారత అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.
14:46 July 22
చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష చరిత్రలో మరో అసాధారణ ఘట్టం ఆవిష్కృతమైంది. జాబిల్లిపై పరిశోధనల కోసం చంద్రయాన్-2 మిషన్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. 20 గంటల కౌంట్‌డౌన్ అనంతరం 3.8 టన్నుల బరువైన చంద్రయాన్-2తో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3ఎం1 వాహక నౌక... మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు నింగికెగిసింది.
16నిమిషాల13సెకన్లపాటుప్రయాణించి...భూకక్ష్యలోచంద్రయాన్-2నువిడిచిపెట్టింది.
5 రోజుల తర్వాత భూనియంత్రిత కక్ష్యలోకి చంద్రయాన్-2 ఉపగ్రహం ప్రవేశిస్తుంది. సగటున 3 లక్షల 84 వేల కిలోమీటర్ల దూరం పయనించనున్న చంద్రయాన్-2 ఉపగ్రహం 48 రోజుల తర్వాత జాబిల్లిపై దిగనుంది.
చంద్రయాన్-2 ఉపగ్రహం బరువు 3,447 కిలోలు. దీన్ని ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌తో అనుసంధానం చేశారు. వీటిలో ఆర్బిటర్ చంద్రుని చుట్టు తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తుంది. ల్యాండర్.....చంద్రునిపై దిగుతుంది. ల్యాండర్‌లో ఉండే రోవర్ జాబిల్లి ఉపరితలంపై నీటి ఆనవాళ్లపై పరిశోధన చేస్తుంది.
చంద్రయాన్-2 ఉపగ్రహం చంద్రుని కక్ష్యకు చేరుకున్న తర్వాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గరగా నెమ్మదిగా దిగనుంది. అందులో నుంచి అత్యంత మృదువుగా రోవర్ బయటకొచ్చి సెకనుకు సెంటీమీటరు వేగంతో 14 రోజుల పాటు పయనించనుంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలను విశ్లేషించి ఆ సమాచారాన్ని, చిత్రాలను పంపించనుంది. చంద్రుడిపై నీరు, ఖనిజాలు, రాతి నిర్మాణాల గురించి పరిశోధనలు చేస్తుంది.
చంద్రయాన్-2 ప్రాజెక్టులో పూర్తి స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించారు. ఇందులో ల్యాండర్‌కు విక్రమ్, రోవర్‌కు ప్రజ్ఞాన్‌గా నామకరణం చేశారు. చంద్రయాన్-2 ఉపగ్రహ తయారీకి 603 కోట్లు ఖర్చు చేశారు. అలాగే జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌ఎం1 వాహకనౌక రూపకల్పనకు 375కోట్లు వ్యయం చేశారు.
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్-షార్‌లో రెండో ప్రయోగ వేదిక నుంచి GSLV మార్క్-3ఎం1 వాహక నౌకను ప్రయోగించారు. ఈ ప్రయోగాన్ని ఈ నెల 15వ తేదీ వేకువజామున చేపట్టాల్సి ఉండగా ప్రయోగానికి 56 నిమిషాల ముందు క్రయోజెనిక్ ట్యాంకర్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించి వాయిదా వేశారు. ఆ లోపాన్ని సరిచేసిన శాస్త్రవేత్తలు ఇవాళ చంద్రయాన్-2ను ప్రయోగించారు.
14:38 July 22
చంద్రయాన్-2ను ప్రయోగించిన ఇస్రో
చంద్రయాన్-2 ప్రయోగం ప్రారంభమయింది. జీఎస్‌ఎల్‌వీ మార్క్-3ఎం1 వాహననౌక ఉపగ్రహాన్ని మోసుకెళ్తోంది. 16 నిమిషాల 13 సెకన్ల తర్వాత నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. కక్ష్యలోకి ప్రవేశించిన అనంతరం. వాహననౌక నుంచి విడిపోనుంది చంద్రయాన్-2.
14:31 July 22
మిషన్ డైరెక్టర్ తుది అనుమతి
చంద్రయాన్-2 ప్రయోగానికి మిషన్ డైరెక్టర్ తుది అనుమతి ఇచ్చారు. కచ్చితంగా.. మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ మార్క్-3ఎం1 వాహననౌక చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది.
14:25 July 22
ఆ పదిహేను నిమిషాలు అత్యంత కీలకం
తొలుత జులై 15న ప్రారంభించాలన్న చంద్రయాన్-2 ప్రయోగం సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. చంద్రయాన్-2ను నింగిలోకి పంపేందుకు కేవలం ఒక నిమిషం అందుబాటులోనే లాంచ్ విండో ఉంది. అయినా.. ప్రయోగం విజయవంతం చేస్తామని ధీమాగా ఉంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).
చంద్రయాన్-1 ప్రయోగం ద్వారా చంద్రునిపై నీటి జాడ, వాతావరణ పరిస్థితులు, జాబిల్లి పుట్టుకపై పరిశోధనలు చేయవచ్చు.
14:08 July 22
చంద్రయాన్-2 ప్రత్యేకం
చంద్రయాన్-2 ప్రాజెక్టును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి రోవర్‌ను దింపిన తొలి దేశంగా అవతరిస్తుంది భారత్. అంతేకాకుండా.. ఈ చంద్రయాన్-2లో ల్యాండర్, రోవర్.. చంద్రుడి ఉపరితలంపై సున్నితంగా దిగుతాయి. తద్వారా.. ఇలా ప్రయోగం నిర్వహించిన దేశంగా అమెరికా, రష్యా, చైనా సరసన నిలుస్తుంది.
13:59 July 22
చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం...
భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్-2 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం-షార్ నుంచి మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 43 నిముషాలకు చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ఎం-1 రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. చంద్రుడిపై విస్తృత పరిశోధనలు చేపట్టి.. అక్కడ నీరు, ఇతర రసాయనాలను గుర్తించే దిశగా చంద్రయాన్-2 ప్రయోగం జరుగుతోంది.