రాజకీయ పదసోపానంలో ఉన్నతస్థానానికి చేరుకోవాలనే ఆకాంక్షతో రాంవిలాస్ పాసవాన్ తనయుడు చిరాగ్ పాసవాన్ వడివడిగా పావులు కదుపుతుండగా... ఆ ఎత్తుగడల ఫలితాలు జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భవితవ్యంపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్ర మంత్రి, దళిత దిగ్గజ నేత రాంవిలాస్ పాసవాన్ కన్నుమూతతో దళితుల్లో పెల్లుబికే సానుభూతి చిరాగ్‌కు కలిసివస్తుందా లేదా అన్నది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చర్చనీయాంశంగా ఉంది.
రాష్ట్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్‌డీఏ) నుంచి బయటకు వచ్చిన చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని లోక్‌జన్‌శక్తి పార్టీ(ఎల్‌జేపీ) ఒంటరిగా పోటీకి సిద్ధమైంది. భాజపా అభ్యర్థులపై పోటీచేయబోమని, ప్రజల్లో నితీశ్ కుమార్‌పై వ్యతిరేకత ఉంది కనుక జేడీయూ అభ్యర్థులను నిలిపే ప్రతీచోటా తమ అభ్యర్థులూ పోటీ చేస్తారని ఎల్‌జేపీ పేర్కొంది. ఎన్నికల తర్వాత భాజపాతో కలిసి పనిచేస్తామని ఇప్పటికే సంకేతాలిచ్చింది. రాంవిలాస్ పాసవాన్ మృతి చెందిన నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎల్‌జేపీని నేరుగా విమర్శించే పరిస్థితిలేదు. నితీశ్ కుమార్ కూడా ప్రత్యక్ష దాడికి దిగకపోవచ్చు. మరోవైపున సానుభూతిని ఓట్ల రూపంలో మలచుకొనేందుకు చిరాగ్ పాసవాన్ యత్నించే అవకాశం ఉంది. దీంతో పాటు తొలి జాబితాలో ప్రకటించిన 42 మంది అభ్యర్థుల్లో 18 మంది అగ్రకులాల వారున్నారు. దళితుల ఓట్లతో పాటు ఇతర సామాజిక వర్గ ప్రజల ఓట్లూ పొందేందుకు చిరాగ్ ప్రయత్నిస్తున్నారని స్పష్టమవుతోంది.
5 జిల్లాల్లో నితీశ్ పార్టీపై ప్రభావం..!
తాజా పరిస్థితులు జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌ను కొంత ఇరకాటంలో పడేసే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఆయన పలు సందర్భాల్లో రాంవిలాస్ పాసవాన్‌పై విమర్శలు చేశారు. తామే పాసవాన్‌ను రాజ్యసభకు పంపించామంటూ నితీశ్ చేసిన వ్యాఖ్యలు ఎల్‌జేపీ శ్రేణులను ఆగ్రహానికి గురిచేశాయి.