గులాబి రంగులో.. పైనాపిల్‌కు తామర రెబ్బలు అతికించినట్టుగా అందంగా ఆకర్షిస్తుంది డ్రాగన్ ఫ్రూట్. సూపర్ మార్కెట్లలో, రోడ్లపై పండ్ల బండ్లలో ప్రత్యేకంగా ఆకట్టుకునే ఈ పండు చూడటానికే కాదు.. రుచితో మైమరపిస్తుంది కూడా. ఔషధ గుణాలతో ఆరోగ్యాన్నిస్తుంది. అయితే, ఇన్నాళ్లు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ విదేశీ పండు.. ఇప్పుడు స్వదేశీ పండు అయిపోయింది. డ్రాగన్ ఫ్రూట్‌ను మన నేలపైనే పండిస్తున్నారు కేరళకు చెందిన ఓ రైతు.
మలప్పురం జిల్లా వాట్టలూర్ గ్రామానికి చెందిన ఉమర్కుట్టి చాలాకాలం విదేశాల్లో పనిచేశాడు. ఫారిన్లో ఈ పండుకున్న డిమాండ్‌ను గమనించాడు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని తెలుసుకున్నాడు. విదేశాల నుంచి తిరిగొచ్చాక వ్యవసాయంపైనే దృష్టి పెట్టాడు. ఇతర ఫలాలు, పంటలతో పాటు.. కొంత భూమిలో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటాడు.