ఎమ్మెల్యేల మాయం, రాజీనామాలు, రాజకీయ సంక్షోభం లాంటి అనూహ్య పరిణామాల తర్వాత మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ రాజీనామా చేశారు. కమల్‌నాథ్ రాజీనామా చేయడం వల్ల రాష్ట్రంలో భాజపా సర్కారు కొలువుదీరేందుకు మార్గం సుగమమైంది.
అయితే భాజపా అధిష్ఠానం ముందుగా ఈ పదవికి ఎవరి పేరునూ ప్రతిపాదించలేదు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి భాజపా సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపైనే పడింది. శివరాజ్ సింగ్ చౌహాన్... మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఇదివరకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. చివరకు మరోసారి ఆయనే రాష్ట్ర సీఎం పీఠాన్ని అధిరోహించారు.
ముందుగా ఈ పదవికి కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్, రాష్ట్ర మాజీ మంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్లు వినిపించాయి. కానీ పార్టీలో చాలామంది అనుకున్నట్లు అధిష్ఠానం మాత్రం శివరాజ్ వైపే మొగ్గుచూపింది. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి.
ఆయనని మించిన నేత లేరు!
రాష్ట్రంలో చౌహాన్ కన్నా ప్రజాకర్షక నేత భాజపాలో లేరు. ఆయనకు ఆర్ఎస్ఎస్తో మంచి సంబంధాలు ఉన్నాయి. శివరాజ్ నాయకత్వంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటికీ.. కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లను సాధించింది. 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో త్వరలో రాష్ట్రంలో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి శివరాజ్‌ను మించిన నేత లేరని పార్టీలో చాలా మంది విశ్వసిస్తున్నారు.
13 ఏళ్ల పాలన
నిమ్న వర్గాల నుంచి వచ్చి రాష్ట్ర సీఎంగా 2018 వరకు వరుసగా 13 సంవత్సరాలు చౌహాన్ పాలించారు. ఇటీవల పలు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా ఎదురీదిన నేపథ్యంలో స్థానికంగా పట్టున్న నాయకులకు పదవులు ఇచ్చి ప్రోత్సహించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని చౌహాన్‌కు అప్పజెప్పింది భాజపా అధిష్ఠానం. కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన వెంటనే రాజకీయ వ్యూహాన్ని పక్కాగా అమలు చేశారు చౌహాన్.
వీటన్నింటి కారణంగానే మరోసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్‌కు అవకాశం దక్కిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:కేరళలో 28 కొత్త కేసులు.. దేశవ్యాప్తంగా 9 మంది మృతి