బిహార్‌లో కొలువుదీరిన నితీశ్ ప్రభుత్వం..
బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్‌డీఏ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఏడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఫాగు చౌహాన్.. నితీశ్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఎన్డీఏకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు.
ప్రజానిర్ణయంతోనే..
ప్రజా నిర్ణయంతోనే ఎన్‌డీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని నితీశ్ వ్యాఖ్యానించారు. తామంతా కలిసి బిహార్ ప్రజలకు సేవ చేస్తామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా సుశీల్ మోదీని నియమించకపోవటం.. భాజపా నిర్ణయమేనని నితీశ్ స్పష్టం చేశారు.
నితీశ్ అరుదైన రికార్డులు..
నితీశ్ కుమార్ గత 20 ఏళ్లలో 7సార్లు సీఎంగా ప్రమాణం చేసి దేశ రాజకీయాల్లోనే అరుదైన అధ్యాయం లిఖించారు. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవకుండానే ఏడుసార్లు ముఖ్యమంత్రి అయిన నేతగానూ ఘనత సాధించారు.
కేబినెట్ మంత్రులు..
నితీశ్‌తోపాటు మరో 14 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో భాజపాకు చెందిన తార కిశోర్ ప్రసాద్, సీనియర్ నాయకురాలు రేణుదేవి ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. తార కిశోర్ ప్రసాద్ ఇప్పటికే భాజపా శాసనసభాపక్ష నేతగా ఎన్నికవగా.... రేణుదేవి భాజపా తరపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
- నితీశ్ మంత్రివర్గంలో జేడీయూ తరపున విజేంద్ర యాదవ్, విజయ్ చౌదరి, అశోక్ చౌదరి, మేవాలాల్ చౌదరి, శీలా మండల్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
- భాజపా నేతలు మంగళ్ పాండే, అమరేంద్ర ప్రతాప్ సింగ్, రాంప్రీత్ పాసవాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
- కూటమిలో ఉన్న హిందుస్థాన్ అవామ్ మోర్చా నుంచి సంతోష్ మాంఝీ, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ నుంచి ముకేశ్ సాహ్నీలకు నితీశ్ మంత్రివర్గంలో చోటు దక్కింది.
మోదీ శుభాకాంక్షలు..
బిహార్ సీఎంగా ప్రమాణం చేసిన నితీశ్‌కు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. బిహార్ అభివృద్ధి కోసం ఎన్‌డీఏ కుటుంబం కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర సంక్షేమం కోసం కేంద్రం నుంచి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
ఆర్జేడీ గైర్హాజరు..
ఈ ప్రమాణస్వీకారానికి ప్రతిపక్ష ఆర్జేడీ నేతలు హాజరుకాలేదు. ప్రజాతీర్పును ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రభావితం చేసినట్లు ఆరోపించింది.