బంగాల్ కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేసి.. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్ ఇచ్చిన సువేందు అధికారి.. త్వరలోనే భాజపా గూటికి చేరనున్నట్టు సమాచారం. దిల్లీలో ఈ నెల 18న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో సువేందు భాజపా తీర్థం పుచ్చుకోనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా ఈ నెల 19న బంగాల్‌కు వెళ్లనున్నారు. ఆయనతో కలిసి సువేందు కూడా రాష్ట్రానికి వెళ్తారని సమాచారం. అయితే.. ఒక వేళ సువేందు దిల్లీకి వెళ్లకపోతే.. అమిత్ షా పర్యటనలోనైనా ఆయన భాజపాలోకి చేరుతారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
సువేందు పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత.. భాజపాలోకి చేరతాననంటే కచ్చితంగా ఆహ్వానిస్తామని ఈటీవీ భారత్‌తో పేర్కొన్నారు బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్.