అన్నింటా 'తొలి' కీర్తి...అంచెలంచెలుగా ఎదిగిన సుష్మా విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ దివికేగారు. గుండెపోటుతో ఎయిమ్స్‌లో మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. క్రమక్రమంగా భాజపాలో అత్యంత కీలక నేతగా ఎదిగిన సుష్మా.. సాధారణ నేపథ్యం నుంచి వచ్చారు. పార్టీలో, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
సుష్మా స్వరాజ్ 1952 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో జన్మించారు. హరిదేవ్ శర్మ, లక్ష్మీదేవి ఆమె తల్లిదండ్రులు. సుష్మా తండ్రి ఆరెస్సెస్‌లో కీలకంగా ఉండేవారు. చిన్నప్పటినుంచే చదువుల్లో చురుకైన సుష్మాకు సంగీతం, సాహిత్యం, లలిత కళలంటే ఆసక్తి.
కళాశాల విద్యను అంబాలాలోనే పూర్తి చేశారు సుష్మా. ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఎన్సీసీ క్యాడెట్‌గా పనిచేశారు. అత్యుత్తమ ఎన్సీసీ క్యాడెట్‌గా అవార్డులూ అందుకున్నారు సుష్మా.
విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి...
విద్యార్థిగా ఉన్న సమయంలోనే 1970లలో ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు సుష్మా. ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆపై జనతా పార్టీలో చేరారు. 1977లో తొలిసారిగా హరియాణాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఏడాది 25 ఏళ్ల వయసులోనే రాష్ట్ర కేబినెట్ మంత్రిగా పనిచేసి రికార్డు నెలకొల్పారు.
1984లో భారతీయ జనతా పార్టీలో చేరిన సుష్మా.. 87లో రెండోసారి హరియాణా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సుప్రీం కోర్టు న్యాయవాదిగానూ పనిచేశారు.
ఇదీ చూడండి:'జమ్మూ'పై మోదీకి అభినందనే 'సుష్మా' చివరి ట్వీట్
లోక్‌సభ చర్చ లైవ్‌కు కృషి.. దిల్లీ సీఎం పీఠం..
1990 ఏప్రిల్‌లో రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు సుష్మా. ఆపై 1996లో లోక్‌సభలో అడుగుపెట్టారు. అదే సంవత్సరం కేంద్రంలో వాజ్‌పేయీ ప్రభుత్వం 13 రోజులపాటు కొనసాగిన సమయంలో.. సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. లోక్‌సభ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు సుష్మా.
1998లో దిల్లీ హాజ్‌కాస్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఆమె.. ఏకంగా రాజధానికి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. దిల్లీ సీఎం పీఠమెక్కిన తొలి మహిళ కావడం విశేషం.
ఇందిరా తర్వాత సుష్మానే...
2000-03 మధ్య వాజ్‌పేయీ హయాంలో మళ్లీ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు సుష్మా. అనంతరం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగానూ సేవలందించారు. 2009-14 మధ్య 15వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఇందిరా గాంధీ తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన మహిళ సుష్మానే.
ఈ సమయంలో దేశానికి ఎన్నో విధాలుగా కృషి చేశారు. తన బాధ్యతలను జాతీయ- అంతర్జాతీయ స్థాయిలో చక్కగా నిర్వర్తించారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా వెనక్కి రప్పించడంలో కీలకంగా వ్యవహరించారు. ఐరాస వంటి వేదికలపైనా భారత్ వాదనను బలంగా వినిపించారు.
ఇదీ చూడండి:ట్విట్టర్ ద్వారా ప్రజల కష్టాలు తీర్చిన 'సూపర్ మామ్'
బలమైన మహిళా నేత...
భారతదేశంలోని అతికొద్ది మంది శక్తిమంతమైన మహిళా నేతల్లో సుష్మాస్వరాజ్ ఒకరు. 4 దశాబ్దాలకుపైగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఎమ్మెల్యే మొదలు.. కేబినెట్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, లోక్‌సభలో విపక్షనేతగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా అనతికాలంలోనే అంచెలంచెలుగా ఎదిగారు.
25 ఏళ్ల వయసులోనే మంత్రిగా సేవలందించి రికార్డు సృష్టించిన సుష్మా.. తొలి మహిళా ముఖ్యమంత్రిగా, భాజపా తొలి జాతీయ మహిళా అధికార ప్రతినిధిగా, లోక్‌సభలో విపక్ష నేతగా వ్యవహరించిన తొలి మహిళగానూ ఘనతలు సాధించారు. అత్యుత్తమ మహిళా పార్లమెంటేరియన్‌గా అవార్డు అందుకున్న తొలి మహిళ కూడా సుష్మానే.
మొత్తానికి ఏడుసార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు సుష్మా స్వరాజ్.
వెంటాడిన అనారోగ్యం...
అనారోగ్య కారణాలతో 2019 సాధారణ ఎన్నికలకు దూరంగా ఉన్నారు సుష్మా స్వరాజ్. అయినా ట్విట్టర్ ద్వారా రాజకీయాలపై తన అభిప్రాయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు. ఇటీవల మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. మంగళవారం సాయంత్రం అస్వస్థతకు గురైన ఆమెను దిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. 67 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. దిల్లీ లోధి రోడ్ శ్మశాన వాటికలో ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.