తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుష్మకు యావత్​ భారతం కన్నీటి వీడ్కోలు - సుష్మా స్వరాజ్

భారత విదేశీ వ్యవహారాల శాఖకు మానవత్వపు పరిమళాలు అద్దిన మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్​ అంత్యక్రియలు పూర్తయ్యాయి. దిల్లీలోని లోధి రోడ్​ శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అగ్రనేతలు చిన్నమ్మకు అంతిమ వీడ్కోలు పలికారు. దేశ, విదేశాల నుంచి అనేక మంది సుష్మ మృతికి సంతాపం తెలిపారు. సుష్మ భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య, భాజపా సీనియర్​ నేత ఎల్​కే అడ్వాణీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

సుష్మకు యావత్​ భారతం కన్నీటి వీడ్కోలు

By

Published : Aug 7, 2019, 5:05 PM IST

సుష్మకు యావత్​ భారతం కన్నీటి వీడ్కోలు

దిల్లీలో బుధవారం విదేశాంగ శాఖ మాజీ ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్​ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. లోధి రోడ్​ శ్మశాన వాటికలో జరిగిన అంతిమ సంస్కారాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, భాజపా అగ్రనేత అడ్వాణీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

దిల్లీ ఎయిమ్స్​లో కన్నుమూత

67 ఏళ్ల సుష్మా స్వరాజ్​ మంగళవారం రాత్రి దిల్లీ ఎయిమ్స్​లో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ వార్త యావత్​ భారత దేశాన్ని కలచివేసింది. సుష్మ హఠాన్మరణంపై ప్రధాని మోదీతో పాటు అనేక మంది ట్విట్టర్​లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మంగళవారం రాత్రే ఆసుపత్రి నుంచి సుష్మ నివాసానికి పార్థివదేహాన్ని తరలించారు. అప్పటి నుంచి పార్టీలకు అతీతంగా అనేక మంది అగ్రనేతలు, కార్యకర్తలు, ప్రజలు ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

ప్రధాని భావోద్వేగం..

బుధవారం ఉదయం సుష్మ భౌతికకాయానికి ప్రధాని శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సుష్మ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు మోదీ.

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ, యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ తదితరులు సుష్మ నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు.

సుష్మా స్వరాజ్​ భౌతికకాయాన్ని చూసి భాజపా సీనియర్​ నేత ఎల్​కే అడ్వాణీ విలపించారు. ఆయన కుమార్తె కూడా సుష్మ కుటుంబ సభ్యులను హత్తుకుని, కన్నీరు పెట్టుకున్నారు.

పార్థివ దేహాన్ని మోసిన రాజ్​నాథ్​

మధ్యాహ్నం 12 గంటల అనంతరం సుష్మా స్వరాజ్​ పార్థివదేహాన్ని నివాసం నుంచి దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయానికి తరలించారు. ప్రజలు, పార్టీ నేతల సందర్శనార్థం సుష్మ భౌతికకాయాన్ని అక్కడే మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంచారు. అనంతరం లోధి రోడ్​లోని శ్మశాన వాటికకు తరలించారు. ఈ సమయంలో రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్​, భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు జేపీ నడ్డా.. సుష్మ పార్థివదేహాన్ని మోశారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాల సమయంలో ప్రభుత్వ లాంఛనాలతో విదేశాంగ మాజీ మంత్రి అంతిమ సంస్కారాలు జరిగాయి.

మౌనం... సంతాపం

సుష్మా స్వరాజ్​ ఆత్మకు శాంతి చేకూరాలని రాజ్యసభలో మౌనం వహించారు సభ్యులు. దిల్లీ, హరియాణా ప్రభుత్వాలు రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించాయి.

సుష్మకు 'విదేశీ వందనం'

అమెరికా, రష్యా, చైనా, యూఏఈ, సింగపూర్​ సహా అనేక దేశాలు సుష్మ మృతి పట్ల సంతాపం తెలిపాయి. భారత్​తో సంబంధాలు బలపడటానికి సుష్మ కీలక పాత్ర పోషించారని కొనియాడాయి.

ABOUT THE AUTHOR

...view details