బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం చేయనున్నారు. అయితే.. డిప్యూటీ సీఎం పదవిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు నితీశ్ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న సుశీల్ కుమార్ మోదీ బదులు తార్‌కిశోర్ ప్రసాద్‌వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఆదివారం జరిగిన సమావేశంలో ఆయనను భాజపా శాసనసభాపక్ష నేతగానూ ఎన్నుకున్నారు.
కేబినెట్లో మార్పులు చేయాలని భాజపా అధిష్ఠానం నిర్ణయించిన నేపథ్యంలోనే ఈ మార్పులు చేయనున్నట్లు భావిస్తున్నారు. ఈ తరుణంలో సుశీల్ మోదీ చేసిన ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కార్యకర్త పదవి నుంచి తనను ఎవరూ తప్పించలేరని పేర్కొన్నారు సుశీల్.
సుశీల్ కుమార్ మోదీ ట్వీట్ ''భాజపా, సంఘ్ పరివార్ నాకు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో చేశాయి. ఇంకెవరూ ఇవి పొందలేదు. భవిష్యత్తులో ఏ బాధ్యత అప్పగించినా సక్రమంగా నిర్వర్తిస్తా. పార్టీ కార్యకర్త పదవినైతే నా నుంచి ఎవరూ లాక్కోలేరు.''
- సుశీల్ కుమార్ మోదీ, భాజపా నేత
మోదీ ట్వీట్‌పై పలువురు భాజపా నేతలు స్పందించారు. కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. పదవి పేరుతో ఒకరు తక్కువ.. మరొకరు ఎక్కువ కారని అన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. ఝార్ఖండ్ భాజపా ఎంపీ నిశికాంత్ దూబే.. కార్యకర్తలకు పార్టీ అమ్మలాంటిదని ట్వీట్ చేశారు. పార్టీ కార్యకర్తగా ఎందరికో ఆదర్శప్రాయంగా నిలవాలన్నారు.
ఇదీ చూడండి:బిహార్ డిప్యూటీ సీఎంగా తార్కిషోర్!
సుశీల్ మోదీ 2005 నుంచి బిహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తూ వస్తున్నారు. ఇప్పుడు వేరొకరిని తీసుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్న వేళ.. రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తారా..?
అయితే.. సుశీల్ కుమార్ మోదీకి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికల ఇన్‌ఛార్జి దేవేంద్ర ఫడణవీస్, రాష్ట్ర సీనియర్ నేతలతో కలిసి బిహార్ ఎన్నికల్లో భాజపా అత్యధిక సీట్లను సాధించడంలో సుశీల్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అందుకే ఇలాంటి సీనియర్ నేతను రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రిమండలిలోకి తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.