తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మృత్యువును జయించిన 'రిత్విక్​ ప్రాజెక్ట్స్' బృందం - ఉత్తరాఖండ్ ప్రమాదం

ఉత్తరాఖండ్​ జల ప్రళయంలో మృత్యువును జయించారు తపోవన్​ సొరంగంలోని రిత్విక్​ ప్రాజెక్ట్స్​కు చెందిన 12 మంది. ముంచుకొస్తున్న వరదను చూసి అధైర్యపడక, కారు చీకట్లను చీల్చుకుంటూ ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ సమయంలో వారు ఎదుర్కొన్న పరిస్థితులను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు బృంద సభ్యులు.

Uttarakhand glacier burst
మృత్యువును జయించిన రిత్విక్​ ప్రాజెక్టు బృందం

By

Published : Feb 10, 2021, 12:52 PM IST

Updated : Feb 10, 2021, 1:17 PM IST

ఉత్తరాఖండ్​ జోషిమఠ్​ వద్ద నందాదేవీ హిమనీనదం విరిగిపడి సంభవించిన జల ప్రళయంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 170 మంది వరకు ఆచూకీ గల్లంతైంది. తపోవన్​ సొరంగం వరద నీటితో నిండిపోయింది. అందులోని రిత్విక్​ ప్రాజెక్ట్స్​లో పని చేస్తున్న 12 మందిని కాపాడారు ఐటీబీపీ జవాన్లు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరు.. ప్రమాదం జరిగిన సమయంలోని పరిస్థితులను ఈటీవీ భారత్​కు వివరించారు. ముంచుకొస్తున్న వరద.. సొరంగంలో కారు చీకట్లు.. సమయం గడుస్తున్న కొద్దీ నీటి మట్టం పెరగటం వంటి సంక్లిష్టతల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడేందుకు ప్రయత్నించిన క్షణాలను గుర్తుచేసుకున్నారు.

మృత్యువును జయించిన రిత్విక్​ ప్రాజెక్టు బృందం

ప్రమాదం జరిగిన సమయంలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి రిత్విక్​ ప్రాజెక్టు సభ్యుల మాటల్లో..

" రిత్విక్​ ప్రాజెక్ట్స్​లో ఏడాదిగా విధులు నిర్వర్తిస్తున్నా. సొరంగంలో పనులు చేస్తున్నప్పుడు లోపలికి ఒక్కసారిగా వరద వచ్చింది. పైన ఉన్న నదిలో నీటి మట్టం పెరగటం వల్ల సుమారు 2 మీటర్ల మేర సొరంగంలో నీరు చేరింది. దాంతో సొరంగంపైన ఉన్న ఇనుప రాడ్లను పట్టుకుని ప్రాణాలు రక్షించుకున్నాం. వరద పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నాం. 20 నిమిషాల తర్వాత వరద కాస్త తగ్గింది. 350 మీటర్ల మేర లోపల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాం. ఆ సమయంలో పూర్తిగా చీకటిగా ఉంది. మొబైల్​ లైట్లు పట్టుకుని ముందుకు నడిచాం. గంట సమయం తర్వాత మొబైల్​ సిగ్నల్​ వచ్చింది. బయట ఉన్నవారికి, ఐటీబీపీకి సమాచారం అందించాం. 30 నిమిషాల్లో ఐటీబీపీ సిబ్బంది మా వరకు చేరుకొని మమ్మల్ని రక్షించారు. "

- శ్రీనివాస్​ రెడ్డి, జియాలజిస్ట్​, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్​

ముంచుకొస్తున్న ప్రమాదంలో తమతో ఉన్న వారు ధైర్యం కోల్పోకుండా ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేస్తూ ముందుకు సాగామన్నారు ప్రాజెక్టు సీనియర్​ ఫోర్​మెన్​ వీరేంద్ర కుమార్​. తమను సురక్షితంగా కాపాడిన ఐటీబీపీ బృందాలకు కృతజ్ఞతలు తెలిపారు.

" నా బృందంలో 12 మంది పని చేస్తారు. పనులు కొనసాగుతుండగా.. సుమారు 11 గంటల సమయంలో వరద వచ్చింది. అందరూ బయటకు వచ్చేయాలని చెప్పాను. 20 మీటర్లు దూరం నడవగానే.. పెద్ద ఎత్తున వరద ముంచుకొస్తోంది. నీటి మట్టం పెరుగుతోంది. దాంతో ఎవరూ అధైర్యపడొద్దని చెప్పాను. సొరంగం పైన ఉన్న ఇనుప రాడ్లను పట్టుకుని ఉన్నాం. పైకి ఒక్క మీటర్​ మాత్రమే ఖాళీ ఉంది. ఎలాంటి ప్రమాదం జరగదు, మనమంతా సురక్షితంగా ఉన్నామని వారికి ధైర్యం చెప్పాను. అర గంట తర్వాత నీటి మట్టం తగ్గింది. ఆ తర్వాత మా బృందాన్ని మొత్తం బయటకు పంపి.. నేను, నా మిత్రుడు చివరకు బయటకు వచ్చాం. మా డైరెక్టర్​ ఐటీబీపీకి సమాచారం ఇచ్చారు. 10 నిమిషాల్లో మా బృందంలోని మొత్తం మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు మా బృందం మొత్తం సురక్షితంగా ఉంది. ఇందుకు ఐటీబీపీ జవాన్లకు కృతజ్ఞతలు. "

- వీరేంద్ర కుమార్​ గౌతమ్​, సీనియర్​ ఫోర్​మెన్​, ఉత్తర్​ప్రదేశ్​

ప్రమాదం జరిగిందని అధైర్యపడబోమన్నారు వీరేంద్ర కుమార్​. ప్రభుత్వ సహకారంతో.. ప్రాజెక్టును పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:సొరంగంలోని వారి కోసం జోరుగా సహాయక చర్యలు

లైవ్​ వీడియో: వరదలో కొట్టుకుపోయిన కార్మికులు

ఉత్తరాఖండ్​ వరదలు: ఆ పరికరంపైనే 'అణు'మానాలు

Last Updated : Feb 10, 2021, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details