ఛత్తీస్‌గఢ్‌లోని మైన్‌పాట్ గ్రామం.. రమణీయమైన ప్రకృతి సోయగాలకు, అందమైన కొండలూ కోనలకు నెలవు. పైనుంచి కిందకు ఎగసిపడే జలపాతాలు, ప్రకృతి సిద్ధమైన అందాలు మైన్పాట్కు వచ్చే ప్రతి పర్యాటకుడిని ఇట్టే కట్టిపడేస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ఛత్తీస్గడ్ సిమ్లాగా పిలుస్తుంటారు. వీటికి తోడు ఇక్కడ మరో అంశం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. అందులో ఒకటి స్పాంజి భూమి. ఇక్కడ ఉండే ప్రత్యేకమైన నేల స్వభావం వల్ల భూమి కొన్నిసార్లు స్పాంజిలా కుచించుకుపోతుంది. ఓ మెత్తని పరుపుపై ఉన్న అనుభూతి కలుగుతుంది.
సుర్గుజా డివిజన్ ప్రధాన కేంద్రమైన అంబికాపుర్‌కు 45 కి.మీ దూరంలో ఈ మైన్‌పాట్ ప్రాంతం ఉంది. ఇక్కడి భూమిపై కాలు పెట్టగానే.. నేల కిందికి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. అయితే ఇలా స్పాంజిలాగా లోపలకు ఎందుకు కుంగిపోతుందనే విషయంపై శాస్త్రీయ పరిశోధనలేవీ జరగలేదు.
అయితే దీనికి కారణం అగ్ని పర్వతమేనని స్థానిక పరిశోధకుడు శ్రీస్ మిశ్రా చెప్పుకొచ్చారు. ఈ నేల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు ఈటీవీ భారత్‌కు వెల్లడించారు.
"అగ్నిపర్వతం ఆవిర్భావానికి ఈ ప్రాంతం కేంద్రం. ఈ విషయాన్ని నిరూపించే సంకేతాలు ఇక్కడ అనేకం కనిపిస్తాయి. ఇక్కడి చిత్తడి నేల ఛోటానాగ్‌పుర్ పీఠభూమిలో భాగం. ఈ పీఠభూమి అగ్నిపర్వతాల వల్లే ఏర్పడింది. అగ్నిపర్వతం బిలంలో ఉండే పరిస్థితులే మైన్‌పాట్ చిత్తడి నేలలో ఉన్నాయి. అగ్నిపర్వత బిలం వ్యాసం 300 మీటర్లు ఉంటుంది. అదే విధంగా ఇక్కడి చిత్తడి నేల వ్యాసం కూడా సుమారు 300 మీటర్లు ఉంది. దీంతో పాటు చుట్టుపక్కల కనిపించే రంగురంగుల నేల కూడా ఇదే వాస్తవాన్ని స్పష్టం చేస్తోంది."
-ఎస్ మిశ్రా, స్థానిక పరిశోధకుడు