మధ్యప్రదేశ్ అసెంబ్లీ బలపరీక్షకు సంబంధించి దాఖలైన వ్యాజ్యంపై నేడు విచారించనుంది సుప్రీంకోర్టు. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి మంగళవారం నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై బుధవారం ఉదయం 10.30 గంటల లోపు సమాధానమివ్వాలని కమల్‌నాథ్ సర్కారును ఆదేశించింది.
జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యప్రదేశ్ ప్రభుత్వం, శాసనసభ కార్యదర్శి పేరిట నోటీసులు జారీ చేసింది.
నిన్న జరిగిన విచారణలో భాగంగా రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల అంశాన్ని ప్రస్తావించారు శివరాజ్‌సింగ్ చౌహన్ తరఫు న్యాయవాది. 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయగా.. ఆరుగురికి ఆమోదం లభించిందని, మిగిలినవారూ తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతున్నారని పేర్కొన్నారు. విచారణ అనంతరం మెజారిటీక అవసరమైన సభ్యులు తమవద్ద ఉన్నారని చౌహాన్ స్పష్టం చేశారు.
లేఖల యుద్ధం..
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో లేఖల యుద్ధం కొనసాగుతోంది. అదృశ్యమైన ఎమ్మెల్యేలు తిరిగివచ్చేలా చూడమంటూ ఎంపీ గవర్నర్ లాల్జీ టాండన్‌కు అసెంబ్లీ స్పీకర్ ఎన్పీ ప్రజాపతి ఓ లేఖ రాశారు. ఈ ఎమ్మెల్యేలు ఇష్టపూర్వకంగానే రాజీనామాలు చేశారా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
అదృశ్యమైన ఎమ్మెల్యేలు తిరిగివచ్చేలా చర్యలు తీసుకోవడం సహా వారి కుటుంబసభ్యుల సందేహాలు తీర్చాలని ప్రజాపతి గవర్నర్‌ను కోరారు. తనకు రాజీనామా పత్రాలు సమర్పించే సమయంలో ఈ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులెవరూ లేరని ప్రజాపతి తెలిపారు. రాజీనామాలు స్వచ్ఛందంగా సమర్పించినట్లయితే, కుటుంబసభ్యులు ఎందుకు లేరని ఆయన ప్రశ్నించారు.