తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిదంబరం: సీబీఐ కస్టడీ మరో 4 రోజులు పొడిగింపు - సీబీఐ

చిదంబరం పిటిషన్లపై సుప్రీం విచారణ

By

Published : Aug 26, 2019, 10:35 AM IST

Updated : Sep 28, 2019, 7:19 AM IST

17:18 August 26

చిదంబరం సీబీఐ కస్టడీ విచారణ 4 రోజులు పొడిగింపు

చిదంబరం సీబీఐ కస్టడీని మరో 4 రోజులు పొడిగిస్తూ తీర్పు వెలువరించింది దిల్లీ రోస్​ అవెన్యూ కోర్టు. కేంద్ర దర్యాప్తు సంస్థ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్​ కుమార్​. తిరిగి ఈ నెల 30న చిదంబరాన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. 

16:54 August 26

కస్టడీ విచారణ పొడిగించండి: దిల్లీ కోర్టుతో సీబీఐ

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కస్టడీ విచారణను మరో 5 రోజులు పొడిగించాలని కోరింది సీబీఐ. ఈ అంశంపై మరికొద్దిసేపట్లో తీర్పు వెలువరించనుంది దిల్లీ రోస్​ అవెన్యూ కోర్టు. కేంద్ర దర్యాప్తు సంస్థ తరఫున సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహ్తా, అడిషనల్​ సొలిసిటర్​ జనరల్​ నటరాజన్​ వాదనలు వినిపించారు.

16:23 August 26

రోజ్​​ అవెన్యూ కోర్టుకు చిదంబరం

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో చిదంబరానికి నాలుగు రోజుల సీబీఐ కస్టడీ ముగిసింది. కాంగ్రెస్​ సీనియర్​ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రిని కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి దిల్లీ రోస్​ అవెన్యూ కోర్టుకు తరలించారు. 

అయితే.. కస్టడీ విచారణ ఐదు రోజులకు పొడిగించాలని కోరింది కేంద్ర దర్యాప్తు సంస్థ. 

16:21 August 26

సుప్రీం విచారణ వాయిదా

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. చిదంబరం తరఫున నేడు వాదనలు పూర్తయ్యాయి. ఎన్​పోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ రేపు వాదనలు కొనసాగించనుంది. విచారణ రేపటికి వాయిదా వేసిన నేపథ్యంలో ఈడీ అరెస్టు నుంచి చిదంబరం మధ్యంతర రక్షణను రేపటి వరకు పొడిగించింది అత్యున్నత న్యాయస్థానం.  

16:01 August 26

ఈడీ అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ పొడిగింపు

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో ఈడీ అరెస్టు నుంచి చిదంబరానికి కల్పించిన మధ్యంతర రక్షణ.. రేపటి వరకు కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి బెయిల్​ పిటిషన్లపై రేపు వాదనలు కొనసాగించనుంది అత్యున్నత న్యాయస్థానం. 

15:40 August 26

రోస్​ అవెన్యూ కోర్టుకు చిదంబరం

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి రోస్​ అవెన్యూ కోర్టుకు తీసుకెళ్తున్నారు. 

14:38 August 26

సుప్రీం నిరాకరణ...

సుప్రీంకోర్టులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి చుక్కెదురైంది. ఐఎన్​ఎక్స్​ మీడియా మనీలాండరింగ్​ కేసులో తనకు ముందస్తు బెయిల్​ నిరాకరిస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ.. చిదంబరం దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.కేంద్ర మాజీ ఆర్థికమంత్రి ఇప్పటికే అరెస్టు అయినందున ఈ పిటిషన్​ను విచారించడంలో అర్థం లేదని జస్టిస్​ భానుమతి ధర్మాసనం స్పష్టం చేసింది.

అరెస్టుకు ముందే పిటిషన్​ దాఖలు చేశామని చిదంబరం తరఫు న్యాయవాది కపిల్​ సిబాల్​ కోర్టులో వాదించారు. ఈ నేపథ్యంలో అరెస్టు తర్వాత దాఖలు చేసిన పిటిషన్​ కోర్టు విచారణ లిస్టు కాలేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

INX మీడియా కేసులో తనను CBI అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన మరో పిటిషన్‌పై విచారణను జస్టిస్ R.భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారానికి వాయిదా వేయగా.....ఆ పిటిషన్ నేడు విచారించే వ్యాజ్యాల జాబితాలో లేదు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగొయ్ ఆదేశించిన తర్వాతే చిదంబరం వ్యాజ్యం విచారణ జాబితాలో ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

నేటితో చిదంబరం సీబీఐ కస్టడీ ముగియనుంది. ఆయనను ట్రెయిల్​ కోర్టులో హజరుపరిచి... కస్టడీ పొండిగింపునకు సీబీఐ అభ్యర్థన చేసే అవకాశముంది.

13:05 August 26

అఫిడవిట్​ రగడ...

కోర్టు విచారణలో భాగంగా చిదంబరం తరఫు న్యాయవాది కపిల్​ సిబాల్​ కీలక వ్యాఖ్యలు చేశారు. అఫిడవిట్​లను ఈడీ మీడియాకు లీక్​ చేసిందని ఆరోపించారు. విచారణలో చిదంబరాన్ని సరైన రీతిలో ప్రశ్నిచడం లేదన్నారు. 26 గంటల పాటు విచారణ జరిపినా.. ఒక్క పత్రాన్ని కూడా చిదంబరానికి చూపించలేదని తెలిపారు.

ప్రతులు నిజంగానే ఉంటే... దిల్లీ కోర్టుకు ఈడీ సీల్డ్​ కవర్​లో ఎందుకు అప్పగించిందని ప్రశ్నించారు.

అయితే అఫిడవిట్​ను మీడియాకు ఈడీ లీక్​ చేయలేదని సాలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహ్త కోర్టుకు తెలిపారు. చిదంబరం తరఫు న్యాయవాదులకు వాటిని అప్పింగించిన తర్వాతే... అఫిడవిట్​ లీక్​ అయిందని అరోపించారు.

12:24 August 26

సుప్రీంలో చిదంబరానికి చుక్కెదురు

  • సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు
  • చిదంబరం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణకు తిరస్కరించిన సుప్రీంకోర్టు
  • చిదంబరం అరెస్టైనందున పిటిషన్‌ చెల్లదన్న సుప్రీంకోర్టు
  • అరెస్టు కంటే ముందే పిటిషన్‌ దాఖలు చేశామన్న చిదంబరం తరఫు న్యాయవాది
  • అరెస్టు తర్వాత దాఖలు చేసిన పిటిషన్‌ ఇంకా లిస్టు కాలేదన్న ధర్మాసనం
  • సీబీఐ కస్టడీని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై తర్వాత విచారణ చేద్దామన్న కోర్టు
  • సాధారణ బెయిల్‌ కోసం సరైన ఫోరాన్ని ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచన
  • సీబీఐ కస్టడీని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై తర్వాత విచారణ చేద్దామన్న కోర్టు

12:05 August 26

సుప్రీంలో

సీబీఐ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని చిదంబరం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్​ ఆర్​. భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. అయితే చిదంబరం ఇప్పటికే అరెస్ట్​ అయినందు వల్ల ఈ వ్యాజ్యంలో అర్థం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

10:59 August 26

'విచారణ జాబితాలో లేదు..'

ట్రెయిల్​ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్​... సుప్రీంకోర్టు నేడు విచారించే వ్యాజ్యాల జాబితాలో లేదని కేంద్ర మాజీ మంత్రి తరఫు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు.

భారత ప్రధాన న్యాయమూర్తి ఆదేశించిన తర్వాతే చిదంబరం వ్యాజ్యం విచారణ జాబితాలో ఉంటుందని న్యాయవాదులకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

10:42 August 26

ఇదీ కేసు...

చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్​ఎక్స్​ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల విదేశీ నిధులను అక్రమంగా పొందిందన్న ఆరోపణలతో 2017 మే 15న సీబీఐ ఛార్జీషీటు దాఖలు చేసింది. అనంతరం ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

10:40 August 26

ఇవీ పిటీషన్లు...

తన అరెస్టును సవాలు చేస్తూ చిదంబరం దాఖలు చేసిన మరో వ్యాజ్యాన్ని జస్టిస్​ ఆర్​. భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. సోమవారం వరకు కస్టడీకి అప్పగించిన సీబీఐ న్యాయస్థానం ఆదేశాలను ఈ పిటిషన్​లో సవాలు చేశారు చిదంబరం.

ఐఎన్​ఎక్స్​ మీడియా మనీలాండరింగ్ కేసులో అరెస్టు నుంచి మధ్యంతర రక్షణను కల్పిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది సుప్రీం. చిదంబరం పిటిషన్​కు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ వివరణ ఇవ్వాలని.. ఆయనకు సంబంధించిన మూడు అంశాలకు సోమవారమే సమాధానమివ్వాలని సుప్రీం ఆదేశించింది.

తన వ్యవహారంలో ఆర్టికల్ 21 ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని పిటిషన్​లో పేర్కొన్నారు చిదంబరం. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ జులై 20, 21న తాను వ్యాజ్యాన్ని దాఖలు చేయగా సుప్రీం కోర్టు విచారణ చేపట్టలేదని వెల్లడించారు. ఆగస్టు 21 రాత్రి అరెస్టు చేయడంపై అభ్యంతరం తెలిపారు.

10:16 August 26

మరికాసేపట్లో చిదంబరం పిటిషన్లపై సుప్రీం విచారణ

మరికాసేపట్లో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఐఎన్​ఎక్స్​ మీడియా మనీ లాండరింగ్​ కేసులో తనకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్​ దాఖలు చేశారు చిదంబరం.

Last Updated : Sep 28, 2019, 7:19 AM IST

ABOUT THE AUTHOR

...view details