ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర విచారణపై సుప్రీం కోర్టు దృష్టి సారించింది. ఈ మేరకు గురువారం లిఖితపూర్వక మధ్యంతర ఆదేశాలు వెలువరించింది. నేతలపై ఉన్న కేసుల విచారణకు కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి పంపాలని.. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. ఈ ప్రక్రియ వారం రోజుల్లోగా పూర్తి కావాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
జిల్లాల్లో పెండింగ్లో ఉన్న కేసులు, ప్రత్యేక కోర్టుల అవసరం, ప్రస్తుతం ఉన్న ప్రత్యేక కోర్టులను పరిగణనలోకి తీసుకొని.. ప్రణాళిక తయారు చేయాలని హైకోర్టు సీజేలకు ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం.
సుప్రీం కోర్టు తీర్పులోని కీలక విషయాలు..
- అందుబాటులో ఉన్న న్యాయవాదులు, ఏ అంశాలకు చెందిన కేసులు, ఎంత కాలానికి ప్రత్యేక కోర్టులకు జడ్జిల నియామకం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
- కేసు విచారణ ముగింపునకు పట్టే సమయం, కోర్టుల మధ్య దూరం, సరైన మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకోవాలి.
- ఇప్పటికే విచారణలో ఉన్న కేసులను ప్రత్యేక కోర్టులకు బదిలీ చేయాలా వద్ద అన్న అంశంపై హైకోర్టు సీజేలు నిర్ణయం తీసుకోవాలి.
- ఈ కేసులన్నింటినీ పర్యవేక్షించడానికి హైకోర్టులో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాలి.