మరణ శిక్షతో ముడిపడిన కేసుల్లో హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ దాఖలయ్యే అపీళ్ల సత్వర విచారణ కోసం సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. అపీళ్ల విచారణకు ఆరు నెలల గరిష్ఠ పరిమితిని విధించింది. 'నిర్భయ' హత్యాచార కేసులోని దోషులు పదేపదే కోర్టులను ఆశ్రయిస్తూ శిక్ష వాయిదాకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలను వెలువరించింది.
మార్గదర్శకాలు ఇవే..
* ఉరిశిక్షను సమర్థిస్తూ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన అపీళ్లను విచారణకు స్వీకరిస్తున్నట్లు (లీవ్ గ్రాంట్) సుప్రీం ఉత్తర్వులు జారీచేసిన నాటి నుంచి 6 నెలల్లోపే దాన్ని త్రిసభ్య ధర్మాసనం ముందు లిస్టు చేయాలి. ఆ అపీలు సిద్ధమైందా.. లేదా.. అన్నదానితో సంబంధం లేకుండా ఈ పని చేయాలి.
* మరణశిక్ష అంశంతో ముడిపడిన ఎస్‌ఎల్‌పీ దాఖలైన వెంటనే ఏ హైకోర్టు నుంచి ఆ కేసు అపీల్ వచ్చిందో దానికి సుప్రీం కోర్టు రిజిస్ట్రీ వర్తమానం పంపాలి. వర్తమానం అందిన 30 రోజుల్లోపు కానీ, కోర్టు నిర్దేశించిన గడువులోగా కానీ ఆ కేసుకు సంబంధించిన రికార్డు, ‘సర్టిఫికెట్ ఆఫ్ సర్వీసు’ను సదరు ఉన్నత న్యాయస్థానం పంపేలా చూడాలి. ఆ రికార్డుతోపాటు, ప్రాంతీయ భాషల్లో ఉన్న దస్తావేజులను తర్జుమా చేసి పంపేలా నిర్దేశించాలి.
* అపీల్‌పై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించిన వెంటనే.. కేసులోని పార్టీలన్నీ 30 రోజుల్లోపు అదనపు పత్రాలు దాఖలుచేసేలా రిజిస్ట్రీ ఒత్తిడి తీసుకురావాలి.
*నిర్దేశించిన గడువులోపు రికార్డులు, అదనపు దస్తావేజులు అందకపోయినా, దాఖలుచేయకపోయినా తగిన ఆఫీసు నివేదికను తయారుచేసి తదుపరి ఆదేశాలకోసం సదరు కేసును సంబంధిత జడ్జీల ఛాంబర్‌లో పెట్టాలి. ప్రస్తుతం ఇలాంటి విషయాలను రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్టు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇకముందు కొత్త విధానం అనుసరించాలి.