అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమికి సంబంధించి దశాబ్దాల వివాదానికి తెరదించింది సుప్రీంకోర్టు. అత్యంత సున్నితమైన కేసులో స్పష్టమైన తీర్పు వెలువరించింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ఆదేశించిన న్యాయస్థానం... వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. రెవిన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద భూమి ప్రభుత్వ భూమి అని.. ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమి.. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుందని ధర్మాసనం తన తీర్పులో ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం 3 నెలల్లో కార్యాచరణను ప్రకటించి రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కేంద్రం, యూపీ సర్కార్ భవిష్యత్ కార్యాచరణను పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.
ముస్లింలకు ప్రత్యామ్నాయం
వివాదాస్పద స్థలంపై.... నిర్మోహి అఖడా, షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని ఆదేశించింది. అయోధ్యలో 5 ఎకరాల స్థలాన్ని కేంద్రం లేదా ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని నిర్దేశించింది. 1956కు ముందు వివాదాస్పద స్థలం తమ అధీనంలో ఉందని నిరూపించేందుకు ముస్లింలు ఆధారాలు చూపలేకపోయారని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.
పురావస్తు శాఖ నివేదికలు..
నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలు పరిగణనలోకి తీసుకున్నామని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. బాబ్రీ మసీదును ఖాళీ ప్రదేశంలో కట్టలేదని స్పష్టం చేసింది. పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని న్యాయస్థానం పేర్కొంది. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందని పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందూ నిర్మాణం ఉందని పురావస్తు విభాగం చెబుతోందని న్యాయస్థానం పేర్కొంది. మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని పురావస్తు శాఖ ఎక్కడా చెప్పలేదని ధర్మాసనం వివరించింది.
అయోధ్యలోనే రాముడు..
రాముడు అయోధ్యలోనే జన్మించాడన్నది నిర్వివాదాంశమని పేర్కొంది న్యాయస్థానం. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయంలో రాముడి జన్మించాడని హిందువులు విశ్వసిస్తున్నారని పేర్కొంది. రెండు మతాలు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేసేవన్న ధర్మాసనం... రాముడు అయోధ్యలోనే పుట్టాడని ముస్లింలు కూడా అంగీకరిస్తారని వ్యాఖ్యానించింది. ఈ కేసుకు అధికరణం 47 వర్తించదని స్పష్టం చేసింది. న్యాయమూర్తి ఆదేశాలు ఉన్నప్పుడే 47వ అధికరణం వర్తిస్తుందని తేల్చి చెప్పింది.