మహారాష్ట్ర అంశంపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమా? అనే అంశాన్ని పరీశిలించిన సుప్రీం కోర్టు. సోమవారం ఉదయం 10.30 గంటలకల్లా గవర్నర్‌కు అందించిన మద్దతు లేఖలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది. సోలిసిటర్ జనరల్ లేఖలు సమర్పించిన తర్వాతే బలపరీక్షపై నిర్ణయం తీసుకుంటామని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.
మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు సుప్రీంను ఆశ్రయించాయి. పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. శివసేన పక్షాన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఎన్నికల ముందు ఏర్పడ్డ శివసేన, భాజపా పొత్తు విఫలమైందని ధర్మాసననానికి వివరించారు. తిరిగి ఎన్నికల ఫలితాల అనంతరం కొత్త కూటమి ఏర్పాటైందని తెలిపారు. ఈ నెల 22న రాత్రి 7గంటలకు పార్టీల మధ్య పొత్తులు కొలిక్కి వచ్చాయని, అయితే ఎవరికి తెలియకుండా 23న ఉదయం కొత్త ప్రభుత్వ ఏర్పాటైందని కోర్టుకు తెలిపారు. రాష్ట్రపతి పాలన ఎత్తివేసి భాజపా నేత ఫడణవీస్‌తో సీఎంగా.. గవర్నర్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారని చెప్పారు.
అయితే ఈ క్రమంలో గవర్నర్‌కు సమర్పించిన మద్దతు పత్రాలపై ఏమైనా సమాచారం ఉందా అని సిబల్‌ను జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించగా.. లేదని సిబల్ సమాధానమిచ్చారు. ఈరోజే బలనిరూపణ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
కర్ణాటకలో కూడా ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయని.. అక్కడ 24 గంటల్లో బలపరీక్షకు ఆదేశాలిచ్చారని ధర్మాసనానికి సిబల్ గుర్తుచేశారు. అవసరమైతే కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి రేపే బలనిరూపణను సిద్ధంగా ఉన్నాయన్నారు. కేబినెట్ నిర్ణయంతో అమలులోకి వచ్చిన రాష్ట్రపతి పాలన తిరిగి కేబినెట్ ఆమోదం లేకుండా ఎలా ఎత్తివేస్తారని ప్రశ్నించారు. అలాగే గవర్నర్ వ్యవహరించిన తీరును సిబల్ ధర్మాసనం ముందు తప్పుబట్టారు. ఏ నిబంధనల ప్రకారం గవర్నర్ భాజపాకు అవకాశం ఇచ్చారో తెలియజేయాలని కోరారు. ఏ మద్దతు పత్రాల్ని చూశారు, ఎంతమంది ఎమ్మెల్యేల సంతకాల్ని రాత్రికి రాత్రే పరిశీలించారో బయటి ప్రపంచానికి తెలియజేయాలన్నారు.
ఎన్సీపీ-కాంగ్రెస్ తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వీ దాదాపు ఇదే తరహా అంశాల్ని లేవనెత్తారు. అలాగే కర్ణాటక, గోవాలో జరిగిన పరిణామాల్ని, పలు సందర్భాల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల్ని ఈ సందర్భంగా ధర్మాసనం ముందుంచారు. అనంతరం భాజపా తరఫున వాదనలు ప్రారంభించిన ముకుల్ రోహత్గి.. హైకోర్టును కాకుండా సుప్రీంకోర్టును ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. ఆదివారం రోజు అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని.. దీన్ని విచారణకు స్వీకరించాల్సిన అవసరం కూడా లేదన్నారు. వాదనలు విన్న అనంతరం రేపు ఉదయం 10.30 కల్లా గవర్నర్‌కు అందించిన మద్దతు లేఖలను సమర్పించాలని.. అనంతరం బలపరీక్షపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీం స్పష్టం చేసింది.