మహా రాజకీయంపై కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడనుంది. భాజపా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుపై సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది. భాజపా నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఫడణవీస్‌ను.. గవర్నర్ ఆహ్వానించడాన్ని సవాల్ చేస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఆదేశాలు ఇవ్వనుంది. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించే అంశంపై తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.
బలప్రదర్శన....
మెజార్టీపై ఇరు వర్గాలు ధీమాగా ఉన్నాయి. తమకు సంపూర్ణ ఆధిక్యం ఉందని భాజపా చెబుతున్న వేళ... శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ తమ కూటమి బలాన్ని చాటాయి. ఈ 3 పార్టీలు.. ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో 162 మంది ఎమ్మెల్యేలతో ప్రదర్శన నిర్వహించాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియ, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే.. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, అశోక్ చవాన్ తదితరులు.. ఎమ్మెల్యేలతో ప్రదర్శనకు హాజరయ్యారు.
'మాతో 162’ మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ' ఓ బోర్డును సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా '‘మహా వికాస్ ఆఘాడి' వర్దిల్లాలంటూ పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. 162 మంది ఎమ్మెల్యేలను చూడాలంటే రాత్రి 7 గంటలకు ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్‌కు రావాలని మహారాష్ట్ర గవర్నర్‌ను ట్విట్టర్ వేదికగా శివసేన నేత సంజయ్ రౌత్ ఆహ్వానించారు. తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని.. గవర్నర్‌ను ఆయన కోరారు.