జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని భాజాపాయేతర పార్టీల పాలనలోని 6 రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని, ఆగస్టు 17న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ.. ఆరు రాష్ట్రాల మంత్రులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం తీర్పు విద్యార్థుల జీవించే హక్కును హరిస్తోందని.. కరోనా వేళ పరీక్షల నిర్వహణతో వచ్చే ఇబ్బందులను విస్మరిస్తోందని పేర్కొన్నారు. ఈ పిటిషన్లను బంగాల్ నుంచి మొలోయ్ ఘటక్, ఝార్ఖండ్ నుంచి రామేశ్వర్ ఓరావున్, రాజస్థాన్ నుంచి రఘు శర్మ, ఛత్తీస్గఢ్ నుంచి అమర్జీత్ భగత్, పంజాబ్ నుంచి బీఎస్ సిద్ధు, మహారాష్ట్ర నుంచి ఉదయ్ రవీంద్ర సావంత్ దాఖలు చేశారు.