కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ ఆమోదంతో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారించనుంది. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, పలు రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్న ఈ చట్టాలపై సుప్రీంకోర్టు న్యాయవాది మనోహర్ లాల్ శర్మ, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, చత్తీస్గఢ్ కిసాన్ కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన మూడు వ్యాజ్యాలను విచారించనుంది సరోన్నత న్యాయస్థానం విచారించనుంది.
తొలి విచారణలో భాగంగా.. పిటిషన్లో పేర్కొన్న అంశాల ఆధారంగా వీటిని విచారణకు స్వీకరించాలా లేదా అన్న అంశంపై సీజేఐ ధర్మాసనం నిర్ణయం తీసుకోనుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సీజేఐ జస్టిస్ ఎస్ఎ బొబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ రామ సుబ్రమణియన్ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనున్నారు.
ఎంఎస్పీను కూల్చివేసేలా ఉన్నాయంటూ..
రైతుల సాధికారత, మద్దతు ధర హామీ, సేవల ఒప్పంద చట్టం-2020, రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార ప్రోత్సాహక, సులభతర చట్టం-2020, నిత్యవసర సరకుల సవరణ చట్టం-2020లను సవాలు చేసిన పిటిషనర్లు.. ఇవి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించే వ్యవస్థను కూల్చివేసేలా చట్టాలు ఉన్నాయని స్పష్టం చేశారు. చిన్న, మధ్య తరగతి రైతులను.. కార్పొరేట్ సంస్థలు దోపిడి చేసే అవకాశం ఉందని చట్టాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని 7న షెడ్యూల్ కింద రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయ వాణిజ్య అంశాలపై పార్లమెంట్ చట్టాలు రూపొందించే పరిధిని కూడా పిటిషనర్లు ప్రశ్నించారు.
సర్వత్రా ఉత్కంఠ
దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, పలు రైతు సంఘాలు కొత్త వ్యవసాయ చట్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. సుప్రీంకోర్టు నిర్ణయంపై స్వరత్రా ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి:వ్యవసాయ చట్టాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కొత్త బిల్లు