కీలక అయోధ్య భూవివాద కేసు అనంతరం.. సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు వెల్లడించింది. భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి వస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు దిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం.
అయితే.. గోప్యత, వ్యక్తిగత గోప్యత చాలా ముఖ్యమైన అంశాలని.. భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చే ముందు వాటిని సంతులితము చేయాలని సూచించింది. పారదర్శకత పేరుతో.. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించరాదని పేర్కొంది. దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. నేడు తుది తీర్పు వెలువరించింది.
2007లో పిటిషన్.. 2010లో తీర్పు
2007లో సమాచార హక్కుచట్టం కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ అడిగిన సమాచారం ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీనితో అగర్వాల్ కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని, అందువల్ల న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు వెల్లడించాలని కేంద్ర సమాచార కమిషనర్ సుప్రీంకోర్టుకు సూచించింది.