గత కొన్ని రోజులుగా చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇస్తున్న బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలాపై సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైకోర్టులో ఆమెకు శాశ్వత హోదా కల్పించేలా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును వెనక్కి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
జస్టిస్ పుష్ప గనేడివాలా బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్‌లో న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ బెంచ్‌కు ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా ధ్రువీకరించేందుకు జనవరి 20న సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదనలు చేసింది. కాగా.. ఇటీవల మైనర్లపై లైంగిక వేధింపుల కేసుల్లో జస్టిస్ పుష్ప కొన్ని సంచలన తీర్పులు వెల్లడించారు.
12 ఏళ్ల బాలిక ఛాతీ భాగాన్ని ఓ వ్యక్తి తడమగా, చర్మం తగలనందున దీనిని లైంగిక వేధింపుల కింద పరిగణించలేమని జనవరి 19న జస్టిస్ పుష్ప నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. దుస్తుల మీద నుంచి శరీరభాగాలను తాకడం వేధింపులుగా పేర్కొనలేమని, లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని ధర్మాసనం పేర్కొంది.