తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్భయ కేసు: సుప్రీంలోనూ చుక్కెదురు- ఉరి తథ్యమే - NIRBHAYA NEWS RECENT

supreme-court-dismisses-the-curative-petition
నిర్భయ దోషి పవన్​ క్యురేటివ్​ పిటిషన్​ కొట్టివేత

By

Published : Mar 19, 2020, 11:28 AM IST

Updated : Mar 20, 2020, 3:40 AM IST

03:34 March 20

పవన్ వ్యాజ్యాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు  

నిర్భయ దోషి పవన్ వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించటాన్ని సవాలు చేస్తూ నిర్భయ దోషి పవన్​ గుప్తా అర్ధరాత్రి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వాదనల సందర్భంగా పవన్​ మైనర్​ అనే విషయంపైనే కోర్టుకు విన్నవించగా.. సొలిసిటర్​ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి ఈ కేసులో క్షమాభిక్ష ప్రసాదించేందుకు రాష్ట్రపతి అధికారాలు పరిమితమని వ్యాఖ్యానించిన కోర్టు.. వ్యాజ్యాన్ని తిరస్కరించింది.  

02:47 March 20

సుప్రీంలో విచారణ ప్రారంభం

క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించటాన్ని సవాలు చేస్తూ నిర్భయ దోషి పవన్​ గుప్తా దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. నిర్భయ తల్లిదండ్రులు కూడా కోర్టుకు చేరుకున్నారు. సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఆర్.భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు వింటోంది. 

తొలుత కోర్టు వద్ద కాసేపు గందరగోళం సృష్టించారు దోషి తరఫు న్యాయవాది ఏపీ సింగ్​. తన సహాయకులను కోర్టు సిబ్బంది కరోనా వైరస్​ కారణంగా అనుమతించలేదు. 

02:11 March 20

సుప్రీంకోర్టుకు నిర్భయ దోషులు..

ఉరి శిక్ష అమలుకు మరికొద్ది ఘడియలే ఉన్న సమయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు నిర్భయ దోషులు. తమ వ్యాజ్యాన్ని దిల్లీ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీం రిజిస్ట్రార్​ను కలిసి కేసు వివరాలను సమర్పించారు దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్. దిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. 

01:35 March 20

పిటిషన్​ కొట్టివేసిన దిల్లీ హైకోర్టు..

చివరి నిమిషంలో నిర్భయ దోషులకు చుక్కెదురయింది. ఉరిపై స్టేను నిరాకరించిన దిల్లీ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ముగ్గురు దోషులు దాఖలు చేసిన పిటిషన్​ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది.  

దోషుల పిటిషన్​పై అర్ధరాత్రి విచారణకు స్వీకరించింది జస్టిస్​ మన్మోహన్​, జస్టిస్ సంజీవ్​ నరూలా ధర్మాసనం. వ్యాజ్యంలో సరైన వివరాలు చేర్చలేదని చెబుతూ తిరస్కరించింది.  

సుప్రీంకోర్టుకు వెళతాం..

ఈ తీర్పుపై స్పందించిన దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్​.. వ్యవస్థ వీరికి వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్యానించారు. దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళతామని.. ఇప్పటికే రిజిస్ట్రార్​తో మాట్లాడామని స్పష్టం తెలిపారు ఏపీ సింగ్​.

23:34 March 19

నిర్భయ కేసులో దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిర్భయ దోషుల తరఫున న్యాయవాదులకు కావాలంటే ఉదయం 5.30వరకు వాదించుకోవచ్చు అని స్పష్టం చేసింది కోర్టు. 

21:04 March 19

దిల్లీ హైకోర్టుకు నిర్భయ దోషులు...

ఉరి శిక్ష అమలుపై స్టేను నిరాకరించిన దిల్లీ కోర్టు నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు నిర్భయ దోషులు. మరికాసేపట్లో ఈ అంశంపై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. 

15:43 March 19

రేపే నిర్భయ దోషులకు ఉరి.. స్టే పిటిషన్​ కొట్టివేత

నిర్భయ కేసులో నలుగురు దోషులకు రేపే ఉరి శిక్ష అమలు కానుంది. తాజాగా తమ ఉరి అమలును నిలిపివేయాలంటూ దోషులు దాఖలు చేసిన పిటిషన్​ను దిల్లీ పాటియాలా హౌస్​ కోర్టు కొట్టివేసింది. ఉదయం 5.30 గంటలకు తిహార్​ జైల్లో మరణ శిక్ష విధించనున్నారు. 

14:52 March 19

ఉరి శిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ కేసు దోషి ముకేశ్​ సింగ్​ చేసిన ఆఖరి ప్రయత్నం విఫలమైంది. నేరం జరిగిన సమయంలో తాను అసలు దిల్లీలోనే లేనంటూ అతడు వేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ పిటిషన్​కు విచారణ అర్హత లేదని తేల్చిచెప్పింది. మరణశిక్షను సవాలు చేసేందుకు ఉన్న న్యాయపరమైన అవకాశాలన్నింటినీ ముకేశ్​ ఉపయోగించుకున్నాడని, ఇక అతడు ఎలాంటి సాక్ష్యాలు తీసుకొచ్చినా పరిగణనలోకి తీసుకోవడం కుదరదని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. ఫలితంగా రేపు ఉదయం ఐదున్నర గంటలకు ముకేశ్​ సహా మొత్తం నలుగురు దోషుల్ని ఉరి తీసేందుకు మార్గం సుగమం అయింది. 

నేరం జరిగిన సమయంలో తాను దిల్లీలో లేనని, మరణశిక్షను రద్దుచేయాలని గతంలో దిల్లీ పటియాలా హౌస్ కోర్టు, దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు ముకేశ్. రెండు చోట్ల అతడికి నిరాశే మిగలగా... సుప్రీంకోర్టులో తాజాగా వ్యాజ్యం వేశాడు. సర్వోన్నత న్యాయస్థానంలోనూ అతడికి చుక్కెదురైంది. 

12:38 March 19

సుప్రీంలో ముకేశ్​ మరో పిటిషన్​..

నిర్భయ దోషుల్లో ఒకడైన ముకేశ్​ సింగ్​ తాజాగా సుప్రీం కోర్టులో మరో పిటిషన్​ దాఖలు చేశాడు. నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను దిల్లీలో లేనన్న పిటిషన్​ను నిన్న దిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ తాజాగా సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేశాడు.

నిర్భయ దోషులు నలుగురికి రేపు ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని పటియాలా హౌస్ కోర్టు ఇప్పటికే డెత్‌ వారెంట్లు జారీ చేసింది. దిల్లీ తిహార్ జైలు అధికారులు ఉరిశిక్ష అమలుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముకేశ్​ పిటిషన్​ దాఖలు చేయడం వల్ల ఉరిశిక్ష అమలవుతుందా.. లేదా అనేది చూడాలి.

11:50 March 19

రేపే ఉరి!

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుకు ఎట్టకేలకు మార్గం సుగమం అయినట్లు కనిపిస్తోంది. మరణశిక్షను జీవిత ఖైదుగా కుదించాలని నిర్భయ దోషి పవన్‌ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ధర్మాసనం పవన్‌ గుప్తా పిటిషన్‌పై గురువారం విచారణ నిర్వహించింది. అతడి పిటిషన్‌ను కొట్టివేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. నిర్భయ దోషులు నలుగురికి రేపు ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని పటియాలా హౌస్ కోర్టు ఇప్పటికే డెత్‌ వారెంట్లు జారీ చేసింది. 

11:24 March 19

నిర్భయ కేసు: చివరి నిమిషం దాకా వాదించుకోండి-దిల్లీ హైకోర్టు

  • నిర్భయ దోషి పవన్ గుప్తా రెండో క్యురేటివ్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • పవన్ గుప్తా పిటిషన్‌ను కొట్టివేసిన జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం
  • మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని క్యురేటివ్ పిటిషన్ వేసిన పవన్
  • రేపు ఉ.5.30 గం.కు ఉరి అమలుకు డెత్ వారెంట్లు ఇచ్చిన పటియాల హౌస్‌ కోర్టు
Last Updated : Mar 20, 2020, 3:40 AM IST

ABOUT THE AUTHOR

...view details